అధికార పార్టీ తనపై కక్ష సాధించేందుకే టిడిపి కార్యకర్తలను ఇబ్బందిపెడుతోందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక వైఎస్సార్‌సిపి నేతల ప్రోద్బలంతో తెలుగు దేశం కార్యకర్త రమణ నాయక్ ఇంటిని కూల్చేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని అన్నారు. అక్రమ కట్టడం పేరుతో తమ కార్యకర్త  ఇంటిని కూల్చేందుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికార పార్టీని, అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. 

కర్నూలు జిల్లా అవుకు మండల కేంద్రంలో టిడిపి కార్యకర్త వేంకట రమణ నాయక్ నివాసముంటున్నాడు. అయితే అతడి ఇంటిని కూల్చేందుకు ఇవాళ స్థానిక అధికారులు ప్రయత్నించగా టిడిపికి చెందిన  మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి  అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

ఉదయం రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బందితో  కలిసి  జెసిబి తో  వెంకట్ రమణ నాయక్ ఇంటి వద్దకు వచ్చారు.  విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే  అవుకు పట్టణానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

ఇళ్లు కూల్చేందుకు వచ్చిన అధికారులకు మాజీ ఎమ్మెల్యే జనార్దనరెడ్డికి మద్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్త రమణ నాయక్ టీడీపీకి మద్దతు దారులుగా నిలబడడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 

వైసిపి నాయకులు కుట్రపన్ని తమ కార్యకర్త ఇంటిని అక్రమ కట్టడంగా చిత్రీకరించి అధికారుల ద్వారా నోటీసులు పంపారని జనార్థన్ రెడ్డి ఆరోపించారు. గిరిజనుడైన  తమ కార్యకర్తపై వైసిపి నేతలు కక్ష కట్టారని మండిపడ్డారు. వైసిపి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. 

తమ కార్యకర్తలకు అండగా ఉంటామని ఈ విషయంలో హైకోర్టు కూడా వెళ్తానని అధికారులకు ఆయన హెచ్చరికలు చేశారు. అన్యాయంగా వెంకటరమణ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తే  తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులతో పాటు వైసీపీ నేతలను హెచ్చరించారు.

 ఈ సందర్భంగా ఘటనాస్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. రమణ నాయక్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఇళ్లు  నిర్మిచటంతో చట్ట ప్రకారం నోటీసు ఇచ్చి అక్రమ కట్టడాలను కూల్చేందుకు ప్రయత్నించామని అధికారులు అంటున్నారు. టిడిపి నేతలు అడ్డుకోవటంతో అధికారులు తాత్కాలికంగా కూల్చివేతను నిలిపేశారు.