తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటడం, కొద్ది ఖర్చుతో దట్టమైన పచ్చదనాన్నిపెంచేందుకు తెలంగాణ అటవీశాఖ ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం మంచి ఫలితాలు ఇస్తోంది
తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటడం, కొద్ది ఖర్చుతో దట్టమైన పచ్చదనాన్నిపెంచేందుకు తెలంగాణ అటవీశాఖ ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం మంచి ఫలితాలు ఇస్తోంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని చోట్ల ఇదే విధానాన్ని అటవీ శాఖ అమలు చేయబోతోంది. దట్టమైన అటవీ సంపదను, అది కూడా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన చెట్లను పెంచటం ఈ మోడల్ ప్రత్యేకత.
ప్రస్తుతం అటవీ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలకు తోడు, క్షీణించిన అటవీ ప్రాంతాల్లో ఒక్కో ఎకరాను మియావాకి విధానంలో అడవులుగా మారుస్తున్నారు. అభివృద్ది, వివిధ ప్రాజెక్టుల వల్ల అటవీ భూములు క్షీణించటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం.
క్షీణించిన అటవీ ప్రాంతంలో పూర్తి శాస్త్రీయ పద్దతుల్లో మట్టిని ట్రీట్ మెంట్ చేయటం, వర్మీ కంపోస్టును వాడుతూ, ఆ మట్టి స్వభావానికి అనుగుణమైన మొక్కలను గుర్తించి నాటడం, దాదాపు అడుగుకో మొక్క చొప్పిన ఎకరం భూమిలో సుమారు నాలుగు వేల వివిధ రకాల మొక్కలను నాటుతారు.
పెరిగిన తర్వాత ఒక దానికి మరొకటి అడ్డురాకుండా ఉండేందుకు వృక్ష జాతులు, వాటి ఎత్తు, విస్తరణ ఆధారంగా మొక్కలు నాటుతారు. ఆ మొక్కల ఎదుగుదలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులను కొనసాగించటం కూడా ఈ మోడల్ ప్రత్యేకత.
దాదాపు 2.5 లక్షల రూపాయల ఖర్చుతో నలభై ఐదు రోజుల్లో ఒక ఎకరా భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ది చేయవచ్చు. తెలంగాణలో దీనిని యాదాద్రి మోడల్ గా అమలు చేస్తున్నారు,
ఆవు పేడ, మూత్రంతో తయారు చేసే జీవామృతం లాంటి స్థానిక విధానాలను కూడా దీనికి జోడిస్తున్నారు. చౌటుప్పల్ దగ్గర తంగేడువనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో ఒక ఎకరా భూమిలో పెంచిన మియావాకి అడవి కేవలం ఏడాదిలోనే మంచి ఫలితాలను ఇస్తోంది.
అక్కడ నాటిన మారేడు, నేరేడు, రేల, ఇప్ప, మోదుగు, రోజ్ వుడ్, మద్ది, వేప, శ్రీ గంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు, గోరింటాకు మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పచ్చదనం అలుముకుంది.
ఈ ప్రయోగం ఇచ్చిన ఉత్సాహంతో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోని క్షీణించిన అడవుల్లో ఈ విధానం అమలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ యేడాది రాచకొండ, లక్కారం, బీబీనగర్, కొండమడుగు, వీరారెడ్డి పల్లి, గజ్వేల్, మేడ్చల్, నిజామాబాద్, అదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో మియావాకి విధానాన్ని అమలు చేస్తున్నారు.
తక్కువ ఏరియాలో ఎక్కువ సాంద్రతతో సహజ సిద్దమైన అడవిని సృష్టించటం, పచ్చదనం పెంపు, స్వచ్చమైన ఆక్సీజన్ పరిసర ప్రాంతాలకు అందించేలా ఈ కొత్త తరహా అడవుల పెంపకం వల్ల తక్షణం కలిగే లాభాలు. అలాగే పట్టణ ప్రాంతాలకు సమీపంలో లభ్యమయ్యే తక్కువ విస్తీర్ణం భూముల్లో పెంచేందుకు అనువుగా ఉంటుంది.
ఈ విధానంలో ఖర్చు, నిర్వహణ వ్యయం తక్కువ, అలాగే నీరు భూమిలోకి ఇంకే గుణాన్ని పెంచటంతో వర్షపు నీటికి ఆయా ప్రాంతాల్లో ఒడిసి పట్టేవీలవుతుంది. అన్ని రకాల పక్షులు, జంతువులకు ఇవి ఆవాసంగా మారటంతో పాటు, జీవ వైవిధ్య కేంద్రాలుగా కూడా ఉపయోగపడతాయి.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రస్తుతం అభివృద్ది చేస్తున్నఅన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మియావాకి విధానంలో కొద్ది ప్రదేశంలో మొక్కలు అటవీశాఖ నాటుతోంది. అర్బన్ పార్కులకు వచ్చే సందర్శకులు, విద్యార్థులకు కూడా ఈ విధానంపై అవగాహన పెంచాలని నిర్ణయించింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 4, 2019, 5:46 PM IST