విజయవాడ: దేవీనరాత్రి ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. క్యూ లైన్‌లో నడుచుకుంటూ‌ వచ్చి దుర్గమ్మ ను‌ దర్శనం చేసుకున్నారు. 

లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవీనవరాత్రి ఉత్సవాల్్లో అధికార పార్టీ నేతల హడావుడే ఎక్కువుగా కనిపించిందన్నారు.


ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా ఉందంటూ మండిపడ్డారు. వంద రూపాయలు టిక్కెట్ లను విఐపి ముద్రలు వేసి అమ్ముకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

ఏ మంత్రి అండదండలతో ఇదంతా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు.అమ్మవారి టిక్కెట్ లను కూడా రీసైక్లింగ్ చేస్తారా అంటూ మండిపడ్డారు. రూ.300 టిక్కెట్  కొన్నవారు‌ కూడా గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థతి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో వెళ్తున్నారంటూ విమర్శించారు.  

ప్రస్తుతం ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయని రోజు గడవటమే కష్టంగా ఉందన్నారు. ఇసుక కొరత తో ఉపాధి లేదని ధ్వజమెత్తారు. పనులు లేక డబ్బులు లేకపోవడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడం లేదన్నారు. 

అన్న ప్రసాదంలో నాణ్యత పెంచాలని భక్తులు తనతో చెప్పినట్లు గుర్తు చేశారు. దానిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దాతలు ఇచ్చిన సొమ్ము సుమారు రూ.60 కోట్లు ఉన్నాయని ఆ వడ్డీతో నాణ్యమైన భోజనాలు అందించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు మాజీమంత్రి దేవినేని ఉమా.