విశాఖపట్నంలో పోలీసులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పోలీసుశాఖ అపార్దం చేసుకుందని టిడిపి నాయకులు వర్ల రామయ్య అన్నారు. ఆయన వ్యాఖ్యలు మొత్తం వ్యవస్ధను ఉద్ధేశించి కాదని...మంచి మంచి పోస్టింగుల కోసం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసుల్ని గురించి మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు. చట్టాలన్నా, వాటిని గౌరవించేవారన్నా టీడీపీకి ఎనలేని గౌరవమని రామయ్య తెలిపారు. 

''మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్ధను కించపరిచేలా మాట్లాడారంటూ కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారుల సంఘం తరపున చంద్రశేఖరెడ్డి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని పోలీసు వ్యవస్ధ  మొత్తానికి ఆపాదిస్తున్నారు. 

చంద్రబాబు పోలీసు వ్యవస్ధను గౌరవించారే కానీ ఎప్పూడు కించపరిచేలా మాట్లాడలేదు. టీడీపీ హయాంలో పోలీసుల సంక్షేమం పట్ల ఆయన ఉదారంగా వ్యవహరించారు. గత టీడీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఏనాడు పోలీసు వ్యవస్ధను దుర్వినియోగపర్చిన సంధర్బం లేదు.  కానీ నేడు జగన్‌ పాలనలో కొంత మంది పోలీసు అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలపైనా, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.  

మంచి మంచి పోస్టింగుల కోసం  అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసు అధికారులనుద్దేశించి మాత్రమే చంద్రబాబు నాయుడు మాట్లాడారు తప్ప అత్యంత  ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు వ్యవస్ధను గురించి కాదు.   కానీ చంద్రశేఖర్‌రెడ్డి గారు  పోలీసు వ్యవస్ధను మొత్తం కించపరిచేలా  చంద్రబాబు మాట్లాడారని వ్యాఖ్యానించటం బాధాకరం. వాస్తవాలు గమనించ మనవి.  చట్టాలన్నా, వ్యవస్ధలన్నా  టీడీపీకిఎనలేని గౌరవం ఉంది. టీడీపీ వాటిని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుంది.'' అంటూ ఏపి డిజిపికి  రామయ్య ఓ లేఖ రాశారు.