యురేనియం తవ్వకాలను వ్యతిరేకించినందుకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. 

ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం అధికార పక్ష నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై పెట్టిన రెండు అక్రమ కేసుల్లోను కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత కూడా కర్నూలు జిల్లా పోలీసులు బెంగళూరులో నివాసముంటున్న అఖిలప్రియ సోదరి ఇంటికి వెళ్లి సోదాలు చేయడం అధికార దుర్వినియోగం, కక్షసాధింపు చర్యలేనని అన్నారు. దానిని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. 

ముగిసిన టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం... చర్చించిన అంశాలివే...

ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే.. అఖిలప్రియ ఆధ్వర్యంలో ప్రజలు, అఖిలపక్షాలు నిరసన వ్యక్తం చేశారు. ఆమె చొరవతో ప్రజలందరూ యురేనియం తవ్వకాలను ముక్తకంఠంతో వ్యతిరేకించారని అన్నారు. అందువల్లే ఆమెపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు.

మరోవైపు కర్నూలు ఎస్పీ చట్టాలను గౌరవించకుండా, వ్యక్తిగత కక్షతో కింద స్థాయి అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నట్లు సమాచారం వుందన్నారు. ఇలా చట్ట వ్యతిరేకంగా బెంగళూరులో ఉన్న అఖిలప్రియ సోదరి ఇంట్లో భార్గవరాం కోసం సోదా కార్యక్రమాలకు పాల్పడటం సరైనది కాదన్నారు. 

గతంలో అఖిలప్రియ తన కార్యకర్తలకు జరిగిన అన్యాయాలకు నిరసనగా తన గన్‌మెన్‌లను ఉపసంహరించుకున్నారు. దానికి ఎస్పీ వ్యక్తిగతంగా తీసుకొని భూమా కుటుంబంపై చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయన్నారు. 

ఈ రకమైన వేధింపుల వల్ల యురేనియం వ్యతిరేక పోరాటాన్ని తెలుగుదేశం, అఖిలప్రియ, భార్గవరామ్‌లు వదిలి పెడతారని అనుకుంటే అది భ్రమ మాత్రమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేధింపులు, అక్రమ కేసులు మానుకోవాలని సూచించారు.  ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని జవహర్ ప్రభుత్వాన్ని  కోరారు.