ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక లేక ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది ఉపాధి కోల్పోతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దీన్ని గుర్తించిన తన సహచరుడు కొల్లు రవీంద్ర దీక్షకు దిగితే ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అందువల్లే మచిలీపట్నం కోనేరుసెంటర్ లో శాంతియుతంగా దీక్ష చేయడానికి వెళుతున్న ఆయన్నిపోలీసులు అత్యుత్సాహంగా అరెస్టు చేశారని అన్నారు. 

ఇసుక కొరత ప్రజలకు తెలియకూడదని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. టిడిపి డిజిపికి కంప్లైంట్ చేసినా, కొల్లు రవీంద్ర నిరాహారదీక్ష చేసినా, చంద్రబాబు ఛలో ఆత్మకూరు చేసినా ... అన్నిట్లో పోటీకొస్తోంది. వైసిపి ప్రభుత్వంలో ఉన్నామన్న విషయం గ్రహించాలని ఎద్దేవా చేశారు. 
 
వైసిపి నాయకులు, నేతల ఆధ్వర్యంలో టన్నుల కొద్దీ ఇసుక పక్క రాష్ట్రాల రాజధానులకు తరలిపోతోంది. స్వర్ణకుటీర్ వేదికగా టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పంచాయితీలు చేస్తున్నాడు.  ఇసుక పక్కరాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా? అని ప్రశ్నించారు. 

రేపు(శనివారం) కృష్ణా జిల్లా టిడిపి సమన్వయ కమిటీ మచిలీపట్నంలో సమావేశమవుతుందని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర దీక్షకు సంఘీభావం తెలుపుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దీక్షలు చేపట్టేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లే జగన్ వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు ఇరవైవేల కోట్లు నష్టం జరిగుతుంటే ఆయన వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారని దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.