గుంటూరు: పోలీసు వ్యవస్ధపై, పోలీసుల సేవలపై  టీడీపీకి ఎనలేని గౌరవం ఉందని... వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులనే తాము తప్పు పడుతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు తెలిపారు. టిడిపి నాయకులు మాచర్ల ఘటనతో పాటు పలు సందర్భాల్లో పోలీసులపై ఆరోపణలు చేయడం, విమర్శించడాన్ని తాజాగా ఏపి పోలీస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. ఇలాగే పోలీస్ వ్యవస్థ, పోలీసులను టార్గెట్ గా చేసుకుని విమర్శిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి హెచ్చరికలపైనే చెంగల్రాయుడు తాజాగా స్పందించారు. 

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....కొంతమంది పోలీసులు పోలీస్ అసోషియేషన్ పేరుతో టీడీపీపై బురద చల్లటం సరికాదన్నారు. ప్రతిపక్షనేతగా జగన్ విశాఖలో పోలీసులను ఉద్దేశించి ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదు అన్న విషయం పోలీసులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.  

''జగన్ ముఖ్యమంత్రయ్యాక అనేక మంది డీఎస్సీలు,  సీఐలు, ఎస్సైలకు  నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకుండా వారి కడుపు మాడుస్తున్నారు. పోలీసు అసోషియేషన్  కి వారి బాధలు పట్టవా? పోలీష్ అసోషియేషన్  పోలీసులపై సమస్యలపై మాట్లాడాలి  కానీ ప్రభుత్వానికి వత్తాసు పలకటం సరికాదు.    పోలీస్  అసోషియేషన్ పేరుతో  పోలీసు వ్యవస్ధను భ్రష్టు పట్టించేలా వ్యవహరించొద్దు''  అని విమర్శించారు.  

''టీడీపీ హయాంలో చంద్రబాబు పోలీసుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కంటే ముందుగా డీజీపీ కార్యాలయం నిర్మించారు. దేశంలో ఇలాంటి డీజీపీ  కార్యాలయం బహుశా దేశంలో ఎక్కడా లేదు. పోలీసులకు కొత్త వాహనాలు సమకూర్చిన ఘనత చంద్రబాబుదే. ఇవన్నీ గుర్తు లేకుండా పోలీసుల్ని అవమానించి జగన్ కి నేడు పోలీసులు కొమ్ము కాయటం బాధాకరం'' అని అన్నారు.

read more  జాగ్రత్త... అలాంటి నాయకులపై కేసులు పెడతాం: ఏపి పోలీసుల సంఘం హెచ్చరిక

''స్ధానిక సంస్ధల్లో ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ అభ్యర్ధుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.  ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన  తీరుకు సంబంధించిన వీడియోలు మా దగ్గరున్నాయి. ఆ వీడియోలు పోలీసులకు అందజేస్తాం.  చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై  వారు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి'' అని ప్రశ్నించారు. 

''రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు స్థానిక  డీజీపీ నారాయణస్వామి రెడ్డిని  బండ బూతులు తిట్టారు. దీన్ని  పోలీసుల సంఘం ఖండించదా? రైల్వే కోడూరులో పోలీసులే టీడీపీ అభ్యర్దులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.  ఓ ఎస్సై అభ్యర్దుల్ని నామినేషన్ వేయకుండా కేంద్రం నుంచి బయటికి పంపారు. కొంతమంది నామినేషన్ పత్రాలు చించేశారు.   ఎమ్మెల్యే సమక్షంలో పోలీసులు టీడీపీ అభ్యర్దులపై దాడి చేశారు'' అని ఆరోపించారు. 

''టిడిపి అభ్యర్దులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేని నామినేషన్ కేంద్రంలోకి ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్లి రిటర్నింగ్ ఆపీసర్ తో ముచ్చట్లు పెట్టకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన  పోలీసులే ప్రజాస్వామ్యాన్ని భక్షిస్తున్నారు.  అనేక చోట్ల టీడీపీ అభ్యర్ధులపై తప్పుడు లిక్కర్ కేసులు పెడుతున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికల్లో కీలక పాత్ర  పోషించాల్సిన పోలీసులు అధికార పార్టీకి  కొమ్ము కాసి ఏక్రగీవం అయ్యేందుకు సహకరించటం బాధాకరం'' అని అన్నారు.

read more  ఎన్నికలు ఆరు నెలలు వాయిదా వేసినా సరే... మా బాధంతా అదే: అవంతి వ్యాఖ్యలు

''తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోగా వారికి ఒత్తాసు పలికి పోలీస్ అసోషియేషన్ తప్పుడు పేరు తెచ్చుకుంటోంది. పోలీసులు తమ  విధులు నిర్వహించకుండా వైసీపీ నేతలు చెప్పినట్లు వ్యవరిస్తున్నారు. కొన్ని చోట్ల కొంతమంది పోలీసులు   నిష్పక్షపాతంగా  వ్యవహరించి ఎన్నికల ప్రకియ సజావుగా జరిగేలా వ్యవహరించినందుకు టీడీపీ తరపున కృతజ్తతలు తెలుపుతున్నాం'' అన్నారు. 

''స్ధానిక ఎన్నికల్లో  90 శాతం వైసీపీ గెలవకపోతే మంత్రలు రాజీనామా చేయాల్సిందేనని ముఖ్యమంత్రే ఎన్నికల్లో  హింసను ప్రోత్సహించారు. ఇలాంటి ముఖ్యమంత్రికి పోలీసులు ఒత్తాసు పలకటం సరికాదు. 6 వారాల తర్వతా ‎ జగరబోయే ఎన్నికల్లోనైనా పోలీసులు నిష్సక్షపాతంగా వ్యవహరించాలి'' అని చెంగల్రాయుడు కోరారు.