మంగళగిరిలో గత కొంతకాలంగా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మొబైల్‌ ఫోన్‌, వాట్సప్‌ ద్వారా యువతీ, యువకులకు మెసేజ్‌లు పంపుతూ జాతీయ రహదారి వెంబడి ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని తాజాగా పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... తాడేపల్లికి చెందిన జ్యోతి అనే మహిళ రాజు అనే వ్యక్తితో కలసి కొంతకాలంగా మంగళగిరి పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న అపార్ట్‌మెంటులో వ్యభిచారం నిర్వహిస్తోంది. మొబైల్‌ ఫోన్‌, వాట్సాప్‌ మెసేజ్‌లను పంపిస్తూ యువతీ, యువకులను రొంపిలోకి లాగుతున్నారు.

ఈ నేపధ్యంలో అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాల మేరకు నార్త్‌సబ్‌ డివిజన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ పర్యవేక్షణలో పట్టణ సీఐ నరేష్‌కుమార్‌ బుధవారం తన సిబ్బందితో వ్యభిచారం జరుగుతున్న ఫ్లాట్‌పై ఆకస్మికంగా దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వ్యభిచారం వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని పట్టణ సీఐ నరేష్‌కుమార్‌ స్పష్టం చేశారు.