ఓ రౌడీ షీటర్ ని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..... భీమవరం పట్టణానికి చెందిన కొప్పిరెడ్డి నరసింహమూర్తి అలియాస్ ముసిలి(45) కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.  అతనిపై గతంలో పలు హత్య కేసులు ఉండగా... భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో  రౌడీ షీట్ ఉంది.

బుధవారం సాయంత్రం ఫస్ట్‌ షో సినిమాకు వెళదామని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని భార్య పిల్లలను తీసుకుని ఆటోలో థియేటర్‌ వద్దకు చేరుకుని భర్తకు ఫోన్‌ చేయగా స్పందించలేదు. ఇంతలో నరసింహమూర్తి తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఓ బంధువు ఆమెకు ఫోన్‌చేశాడు. ఆమె ఆస్పత్రికి చేరుకోగా... నరసింహమూర్తి కత్తిపోట్లకు గురైనట్టు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాల కారణంగా మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా.. నరసింహమూర్తి హత్య కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.