తూర్పు గోదావరి: తుని మండలం ఎస్ అన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మీడియా సంస్థకు చెందిన విలేకరిని కొందరు దుండగులు అతికిరాతకంగా నరికిచంపారు. నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా నరికి సంఘటనా స్థలంనుండి పరారయ్యారు. ఈ దారుణం జిల్లాలో సంచలనంగా మారింది. 

తొండంగి అర్భన్ రిపోర్టర్ కాతా సత్యనారాయణను సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో అతన్ని ముట్టడించిన దుండగులు అందరూ చూస్తుండగానే దారుణంగా నరికిచంపారు. కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి ప్రాణాలు కోల్పోయేవరకు  దాడి చేశారు.

అతడు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసున్నట్లు సమాచారం. అతడి ఇంటికి సమీపంలోని ఆలయంవద్ద కాపుకాసిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహంతో పాటు రోడ్డుపై కూడా రక్తం పారింది. ఈ హత్యపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ దారుణానికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.