తూర్పు గోదావరి: ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా-పిఎం కిసాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దాపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అధికార వైఎస్సార్‌సిపి కార్యకర్తలే హంగామా సృష్టించారు. 

ఈ కార్యక్రమం కోసం వేదికపై  ఏర్పాటుచేసిన ప్లెక్సీలో మాజీ మంత్రి,  టిడిపి నాయకులు నిమ్మకాయల చినరాజప్ప ఫోటో వుండటం వివాదానికి దారితీసింది. అంతేకాకుండా వైసీపీ నాయకుడు దొరబాబు ఫోటో లేకపోవడంతో ఈ ఆగ్రహం కట్టలుతెంచుకుంది. 

దీంతో స్థానిక అధికారులతో పాటు సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన వైఎస్సార్‌సిపి నాయకులపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభ నుండి నినాదాలు చేస్తూ  వైసీపీ నాయకులు, కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. 

అధికార పార్టీ  నాయకులు ఎంత సర్దిచెప్పినా కార్యకర్తలు వినిపించుకోలేదు. ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన గౌరవం కూడా సొంత పార్టీ నాయకుడికి దక్కలేదంటూ దొరబాబు వర్గం ఆందోళనకు దిగింది. 

దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేపడుతున్న వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇలా రసాభాస మధ్యే వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కార్యక్రమాన్ని అధికారులు, స్థానిక నాయకులు ప్రారంభించారు.