ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో ఎక్స్ అఫిషియో సభ్యుల వోటింగ్ సమస్య తీవ్ర వివాదానికి దారి తీసింది. మొదట జనవరి 25 న రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో వోటింగ్ లో పాల్గొనాల్సిందిగా జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కు ఏ మాత్రం చెప్పకుండా నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ మహేందర్ రెడ్డి లేఖ రాశారు. అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది.  తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో తెలంగాణకి చెందిన కె కేశవ రావు ఏపీకి, ఏపీకి చెందిన కేవీపీ రామచంద్ర రావు తెలంగాణకి కేటాయించబడ్డారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇరు రాష్ట్రాల సీఎంల పరస్పర అంగీకారంతో కే కేశవరావు తెలంగాణకు, కెవిపి ఆంధ్ర ప్రదేశ్ కి ఎవరి సొంత రాష్ట్రాలకు వారిని కేటాయించుకున్నారు. ఈ విషయం తెలియని కమిషనర్ చేసిన తప్పిదం వల్ల రెండు పార్టీల మధ్య గొడవలకు కారణమయ్యింది. 

ఏది ఏమైనా ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి స్థానిక అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దాంతో ప్రభుత్వం సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ని రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ బదిలీ వార్త అక్కడి స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. పార్టీల గలాటకు కలెక్టర్ బదిలీ ఎందుకంటూ అక్కడి స్థానిక ప్రజలు ప్రశ్నించటం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. 2013 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ సూర్యాపేట కలెక్టర్ గా డిసెంబర్ 18, 2018 న బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టి సంవత్సరమే అయినా జిల్లా ప్రజలతో ఎనలేని బంధం ఏర్పరచుకున్నారు. 

అమయ్ కుమార్ వచ్చిన వెంటనే తనదైన శైలిలో సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రక్షాళన తీసుకొచ్చారు. ఉద్యోగులు సమయానికి రావటం, ఎవరైనా సాధారణ ప్రజలు కార్యాలయంలో పని కోసం వస్తే సవ్యంగా స్పందించటం, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకపోవటం ఇలాంటివి జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కలెక్టర్ అమయ్ కుమార్ బదిలీ వార్త తెలిసిన వెంటనే ఆ జిల్లా ప్రజల హృదయం బరువెక్కింది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, జిల్లా నలుమూలల్లో చెట్ల పెంపకం విషయంలో కానీ, ప్రజల సమస్యల పట్ల వేగంగా స్పందించటం కానీ, ప్రజావాణి సందర్బంగా వచ్చే సమస్యలను కానీ, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులకు కూడా వెంటనే స్పందించి వీలైనంత త్వరగా వాటి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేసేవారు.

తన కార్యాలయానికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఆ పని పూర్తయిన తర్వాతే వెళ్లేలా చూడాలని కార్యాలయ ఉద్యోగులకు చెప్పేవారు. అందుకనుగుణంగానే ఎవరు ఏ సమస్య మీద కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా సమస్య వెంటనే పరిష్కారమయ్యేది. ఒకవేళ పరిష్కారం కాకున్నా అది ఎప్పుడు అవుతుందో సిబ్బంది చెప్పేవారు.  జిల్లా కలెక్టర్ గా జిల్లాలో తనదైన మార్కును చూపించారు కలెక్టర్ అమయ్ కుమార్. అందుకే జిల్లా ప్రజలు కలెక్టర్ బదిలీ వార్తతో కొంత భావోద్వేగానికి గురవుతున్నారు.