తూర్పుగోదావరి: మరికొద్దిరోజుల్లో దీపావళి పండగ రానుంది. ఈ  నేపథ్యంలో టపాసుల తయారీకి కోసం కొందరు వ్యాపారులు భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రిని తీసుకువచ్చారు. ప్రమాదకరమైన ఈ సామాగ్రిని అక్రమంగా తీసుకురావడమే కాకుండా ఎలాంటి రక్షణలేకుండా నిల్వవుంచడంపై అధికారులు పోలీసులు, సంబంధిత అధికారులు సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఇలా అక్రమంగా టపాసులు తయారుచేస్తున్న కేంద్రాలు, నిల్వవుంచిన గోడైన్లపై వరుసగా దాడులు చేపట్టారు. 

ఇలా కొత్తపేటలో ఎలాంటి అనుమతు లేకుండా నడుస్తున్న బాణాసంచా తయారీకేంద్రాలు, హోల్ సేల్ గోడౌన్ లపై అమలాపురం అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్డీఓ బిహెచ్ భవాని శంఖర్,డీఎస్పీ ఎస్కె మాసుమ్ బాషాలు తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు.

video: బాణాసంచా తయారీ కేంద్రాలపై దాడులు, సీజ్...

మండలపరిధిలోని వాడపాలెం శివారు నారాయణలంకలోని యాళ్ల నాగ వెంకటవర ప్రసాద్ కు చెందిన విజయదుర్గా ఫైర్ వర్క్స్ కేంద్రాన్ని సీజ్ చేశారు. అలాగే  పనసలదొడ్డి రోడ్ లో దూలం శివాజీ కు చెందిన కనకదుర్గా ఫైర్ వర్క్స్ కు చెందిన లైసెన్స్ లేని అదనపు షెడ్డు ను సీజ్ చేశారు. హోల్ సేల్ గోడౌన్ నందు అనధికారికంగా వేసిన షెడ్డులో నిల్వ చేసిన బాణాసంచా సామాగ్రిని  సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ, డీఎస్పీలు మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా తయారు కేంద్రాలు నిర్వహిస్తున్న కారణంగా వీటిని సీజ్ చేశామన్నారు. వీరిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే హోల్ సేల్ గోడౌన్లలో అదనపు షెడ్డు వేయడంతో పాటు బాణా సంచా నిల్వలు చేయడంతో ఆ సరుకును సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ దాడులలో  సిఐ వి.కృష్ణ, ఎస్.ఐ కె.రమేష్, తహశిల్ధార్ జె.డి.కిషోర్ బాబు,ఫైర్ ఆఫీసర్ నాగభూషణం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాళ్లరేవు బాణసంచా కేంద్రంలో పేలుడు: తొమ్మిది మందికి గాయాలు...

ఇటీవల ఇదే జిల్లా తాళ్లరేవులోని బాణసంచా కేంద్రంలో పేలుడు సంబవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  తాళ్లరేవులో శుక్రవారం నాడు ఓ బాణసంచా తయారీ  చేస్తున్న సమయంలో  షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో బాణసంచా పేలుడులో బాణసంచా దుకాణం నిర్వహకుడితో పాటు 9 మంది గాయపడ్డారు. ఇందుకు నెల రోజుల క్రితమే వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది.