కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పట్టణంలోని వ్యాపార సముదాయలపై స్థానిక పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదర్ధాలను(టపాసులు) నిల్వవుంచడంతో పాటు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇలా అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 35,000  విలువచేసే దీపావళి టపాసులను స్వాధీనం చేసుకొవడమే కాకుండా వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. కాలువ నాగేశ్వరరావు ,మాలపాటి శ్రీనివాసులు,సూర్యనారాయణ అనే  ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదయ్యింది. 

కొద్దిరోజుల్లోనే దసరా, దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఇలా తనిఖీలు చేపడుతున్న పోలీసులు తెలిపారు.  పక్కా సమాచారంతో అనుమతిలేని దుకాణాలను గుర్తించి వాటిని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుకుంటే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.   అనుమతులు లేకుండా ఎవరైనా పేలుడు పదార్థాలు విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని కోవెలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు.   ఇలా సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. 

వ్యాపారులు కూడా అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయించకూడదని సూచించారు. ఇకపై కూడా తమ తనిఖీలు కొనసాగుతాయని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ దాడులు కొనసాగుతున్నట్లు ఎస్సై తెలిపారు.