ప్రకృతిని పరిరక్షించాలని తపనపడే జి.డి. అగర్వాల్ లాంటి మహనీయుడిని కోల్పోవడం.. జాతి చేసుకున్న దురదృష్టమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరిద్వార్ లోని పవన్ సదన్ ఆశ్రమంలో శుక్రవారం జరిగిన జి.డి.అగర్వాల్ సంస్మరణ సమావేశంలో, ఆయన పాల్గొని ప్రసంగించారు.

 గంగను స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, గంగలోకి కాలుష్యం చేరకుండా నియంత్రించాలని ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ సాగించిన పోరాటం గురించి తాను ఎప్పటికప్పుడు తెలుసుకునే వాడినని పవన్ అన్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారని తెలిసి.. ఆయన ఆత్మత్యాగం చేయకుండా, ప్రభుత్వం స్పందిస్తుందని భావించానని, అయితే.. దురదృష్టవశాత్తూ ఏ ప్రభుత్వమూ ఆయన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 ప్రస్తుత ప్రభుత్వం గంగను పరిరక్షించాలన్న సంకల్పాన్ని కనబరిచింది.. అయినా అగర్వాల్ ఆత్మత్యాగాన్ని ఆపలేకపోయిందని అన్నారు. అగర్వాల్ మరణ వార్త తనను విపరీతంగా కలచివేసిందని, భారతదేశం తన ఆత్మను కోల్పోతోందన్న వేదన కలిగిందని అన్నారు. 

అగర్వాల్ మృతిపై దేశం మొత్తం తిరగబడుతుందని భావించానని అయితే.. కనీసం ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా ప్రజా స్పందన లేకపోవడం విస్మయానికి గురిచేసిందని అన్నారు. 

గంగానది దేశం మొత్తానిది: 

గంగ ఉత్తర భారతానికో.. పశ్చిమ లేదా తూర్పు ప్రాంతాలకో చెందింది కాదని.. ఇది యావద్భారతదేశానికి సంబంధించినదని అన్నారు. మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని కాపాడేందుకు.. ఆత్మత్యాగం చేసిన అగర్వాల్ స్పూర్తితో.. గంగను పరిరక్షించుకోవడం తన ప్రాథమిక హక్కు అని భావిస్తున్నట్లు చెప్పారు. అగర్వాల్ లాంటి మహాత్ముడి ఆశయాల సాధనకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

శరీరాన్ని నడిపించే ఆత్మ అత్యంత శక్తివంతమైనది. ప్రొ.అగర్వాల్ తన దేహాన్ని వదిలి.. ఆత్మను ఇక్కడే వదిలి మరింత శక్తిమంతంగా తయారయ్యారు. ఆయన శక్తే నన్ను ఇక్కడికి వచ్చేలా మేల్కొలిపింది. అగర్వాల్ సందేశాన్ని యావద్భారతదేశానికి చేర్చేందుకు అవసరమైన నావంతు బాధ్యతను తప్పనిసరిగా నిర్వర్తిస్తాను. ఇది ఆయన ఆత్మశక్తి అని అన్నారు. 

రాజకీయాల వల్ల సాంస్కృతిక వైభవానికి చేటు లేదు 


దేశంలో రాజకీయాలు ఎన్నున్నా.. ఎందరు రాజకీయనాయకులు భావించినా.. దేశ సాంస్కృతిక వైభవాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 
జి.డి.అగర్వాల్ వంటి సంత్‌ల కారణంగా.. అది ఎప్పటికీ భద్రమేనంటూ.. జర్మన్ తత్త్వవేత్త షెఫార్డ్ హావెన్సెన్ మాటలను ఉదహరించారు. 

 చాలామంది యూరోపియన్ వ్యక్తులు.. భారతదేశంలో ఓ నమ్మకాన్ని ప్రచారం చేయాలని భావించిన సందర్భంలో.. తత్త్వవేత్త షెఫార్డ్ వారినుద్దేశించి.. ’’భారతదేశం మీరనుకున్నట్లు ఎన్నటికీ మారదు.. పైగా అదే మీలో పరివర్తన తెస్తుంది’’ అని అన్నారు. అదీ భారతదేశపు శక్తి అని పవన్ వెల్లడించారు. 

దేశంలో సాధుసంతులు ఉన్నారు.. వారు ప్రకృతి కోసం పోరాటాలూ చేస్తారు అన్న పవన్.. 
దేశాన్ని కాపాడాలన్న చిత్తశుద్ధి, స్థిరచిత్తంతో పోరాడిన జి.డి. అగర్వాల్ చూపిన మార్గం కొనసాగుతుందన్న భరోసా వ్యక్తం చేశారు. అందరి సహకారంతో అగర్వాల్ ఆకాంక్షలు, ఆశయాలను భావి తరాలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని, దానికి విజ్ఞులు మార్గనిర్దేశకత్వం చేయాలని పవన్ కోరారు.

రాజకీయాల్లో ఓ అడుగు ముందుకు వెళ్లొచ్చు.. వెళ్లకపోవచ్చు.. అయితే  అగర్వాల్ త్యాగాన్ని గౌరవిస్తూ.. ఇప్పటికే ఉద్యమిస్తోన్న వారి సూచనలు, మార్గనిర్దేశకత్వంలో.. పోరాటాన్ని ముందుకు తీసుకు వెళతానని పవన్ స్పష్టం చేశారు. 

గంగా ప్రక్షాళణ కోసం 111 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేసిన అగర్వాల్.. ఐఐటీలో విద్యాభ్యాసంతో పాటు.. ఉన్నత విద్యావంతులకు బోధన చేసిన గొప్ప జ్ఞాని.  చివరి దశలో సన్యాసాన్ని స్వీకరించారు. 

ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన సంస్మరణ సమావేశంలో పవన్ కల్యాణ్‌తో పాటు..  రామన్ మెగససే అవార్డు  గ్రహీత, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్, ప్రొఫెసర్ విక్రమ్ సోనీ, జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు యూసఫ్ అర్హం ఖాన్,  బొలిశెట్టి సత్య, బస్వరాజ్ పాటిల్, రమేష్ శర్మ, మిశ్రా తదితర నాయకులు, స్వచ్ఛంద సేవకులతో పాటు పలువురు విద్యావంతులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.