హైదరాబాద్ నగరాన్ని వర్షం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాగా... గురువారం రాత్రి నుంచి మళ్లీ వర్షం కురవడం ప్రారంభించింది. దీంతో... పరిస్థితి మరింత దారుణంగా మారింది. హైద్రాబాద్ లోని గుడిమల్కాపూర్ లో 15 సెం.మీ. వర్షం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. దీంతో నగరంలో జన జీవనం అతలాకుతలమైంది.

ఉప్పల్ మెట్రో రైల్వేస్టేషన్ వద్ద రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతం రోడ్డంతా చెరువును తలపించింది. మియాపూర్, పంజగుట్ట, అమీర్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రాంతమైతే పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రజలు కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

దీంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపడుతున్నాయి. వదరల్లో చిక్కుకున్న ప్రజలు ఆహారం, పాలప్యాకెట్లు అందజేస్తున్నారు.