ఇంటి వద్ద పెద్దల మధ్య జరిగిన ఘర్షణ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఓ విద్యార్థి హత్యాయత్నానికి దారితీసింది. పట్టపగలే...రద్దీగా వుండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరగడం  సంచలనంగా మారింది. ఈ దాడిలో గాయపడిన యువకుడు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు.

తమ పెద్దలపై దాడికి యత్నించడాన్న కారణంతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ విద్యార్థిపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో తీవ్రమైన దాడి చేయడమే కాకుండా చంపేందుకు కూడా వెనుకాడలేదు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జనాలు ఆపడంతో హత్యాయత్నాన్ని విరమించుకున్న యువకులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

 పూర్తి వివరాల్లోకి వెళితే... పేదరోగులకు వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాణాలు తీసుకునే కొట్లాటలకు వేదికయ్యింది..  నిత్యం వందల సంఖ్యలో రోగులు చికిత్స కొసం ఆసుపత్రిని అశ్రయిస్తారు. అలాంటిచోట పట్టపగలే కొందరు కాలేజీ యువకులు రాళ్లతో ఓ విద్యార్థిపై దాడికిపాల్పడ్డారు. దాడిలో కిందపడిపోయిన విద్యార్థిని చంపేందుకు పెద్దబండరాయితో ప్రయత్నించగా రోగుల సహాయకులు అడ్డుకున్నారు.

 నిత్యం ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న గొడవలు నివారించేందుకు 200 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించినా ఫలితం లేకుండా పోయింది. తాజా గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా కొట్టి కొందరు యువకులు పరారైయ్యారు. చివరికి ఆసుపత్రి గేటువద్ద దాడికిపాల్పడిన యువకులను పోలీసులు పట్టుకున్నారు.  ఆసుపత్రిలో పట్టపగలే రాళ్లతో దాడికి పాల్పడటంతో రోగుల బంధువులు భయాందోళనకు గురయ్యారు. 

కర్నూలు మండలం మునగాలపాడు బసాపురం గ్రామాలకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తుల మధ్య గొర్రెల పెంపకంపై గొడవ జరిగింది. ఈ గొడవలో ఓ వర్గానికి చెందిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొన్నారు.

  తమ కుటుంబసభ్యుడిపై జరిగిన దాడిని సహించుకొలేకపోయారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఆసుపత్రి ప్రాంగణములో కనబడటంతో ముగ్గురు యువకులు కలిసి అతన్ని చితకబాదారు. ఈ దాడిలో సదరు యువకుడు కుప్పకూలటంతో మరింత రెచ్చిపోయిన యువకులు బండరాళ్లతో మరోసారి దాడికి పాల్పడటానికి ప్రయత్నించగా రోగుల బంధువులు అడ్డుకున్నారు. దీంతో రాళ్ల దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. 

దాడికి పాల్పడిన యువకులు తప్పించుకొనేందుకు ఆసుపత్రిలో పరుగులుతీశారు. పట్టపగలే ఆసుపత్రిలో గొడవకు తెగించటంతో కొంత సేపు ఉద్రికత పరిస్థితికి దారితీసింది. ఈలోపు ఆసుపత్రిలో అవుట్ పోస్టు పోలీసు సిబ్బంది పరుగులుతీసి దాడికి పాల్పడిన యువకులను పట్టుకుని స్టేషన్ కు తరలించారు.