అనంతపురం పట్టణంలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణ నడిబొడ్డున నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. స్థానిక ఎమ్మార్పిఎస్ నాయకుడిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా కత్తెరతో  పొడిచి హతమార్చాడు. ఈ సంఘటనతో పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది. 

అనంతపురం సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్ వద్ద ఎమ్మార్పీఎస్ నాయకుడు జగ్గుల ప్రకాష్, బుక్కరాయ సముద్రంకు చెందిన రమణ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ముందస్తుగానే ప్రకాష్ హతమార్చడానికి పథకం వేసుకుని వచ్చిన రమణ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. తనవెంట తెచ్చుకున్న పదునైన కత్తెరతో ప్రకాష్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 

కత్తెరతో పలుమార్లు కడుపులో పొడవడంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయినప్పటికి నిందితుడు వదిలిపెట్టకుండా అతడి దాడి చేస్తూనే వున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హటాత్తుగా జరిగిన దాడిలో తీవ్రంగా రక్తస్రావమై ప్రకాష్ అక్కడిక్కడే మృతిచెందాడు.

read more మొన్న నిర్భయ... నిన్న ప్రియాంక రెడ్డి... నేడు రోజా...: ప్రభుత్వ నిర్లక్ష్యంపై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం

నిందితుడు అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. హత్య అనంతరం పోలీసులు వచ్చే వరకు నిందితుడు అక్కడే కూర్చున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే నిందితున్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

రక్తపుమడుగులో పడివున్న ప్రకాష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో సరైన న్యాయం చెప్పలేదన్న కోపంతోనే ప్రకాష్ ను రమణ హత్యచేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ హత్యకు గల కారణాలను ఇంకా నిర్దారించలేదు.

read more  దారుణం.. ఇంటర్ చదివే కూతురిపై కన్న తండ్రి అఘాయిత్యం

నిందితున్ని విచారించిన తర్వాత  ఈ హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి నిందితుడు రమణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించనున్నట్లు అనంతపురం టూటౌన్ పోలీసులు తెలిపారు.