కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డను ఓ కన్నతల్లే మాతృత్వాన్ని మరిచి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలకు చెందిన శివరాణిని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కరకు చెందిన పోతుల శివరెడ్డికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు.

వీరికి ఐదేళ్ల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఉన్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రతిరోజూ గొడవలు జరుగుతుండటంతో ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.

పని నిమిత్తం తల్లీదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లడంతో శివరాణి గత ఎనిమిది నెలలుగా వర్కాలలోనే ఉంటుంది. ఈ క్రమంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని శివరాణి పేరిట రాయించారు తల్లీదండ్రులు.

అయితే ఆ భూమిని విక్రయించి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా శివరెడ్డి.. భార్యను తిరిగి వేధించడం మొదలుపెట్టాడు. దీపావళి పండుగకు రావాల్సిందిగా శివరాణికి భర్త ఫోన్ చేసి పిలవగా.. తాను రానని తేల్చి చెప్పింది.

దీంతో అతను తన బిడ్డను తనకు అప్పగించాల్సిందిగా గొడవకు దిగాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివరాణి.. అవసరమైతే కొడుకునైనా చంపుకుంటా గానీ నీకు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కుమారుడు యశ్వంత్‌కి మరుగుదొడ్లను శుభ్రం చేసే యాసిడ్ తాగించి నిద్రపుచ్చింది. శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి కుమారుడు మరణించడాన్ని చూసి తట్టుకోలేక భయంతో ఆమె సైతం యాసిడ్ తాగి 100కు సమాచారం ఇచ్చింది.

వెంటనే వర్కాలలోని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు శివరాణిని ఆసుపత్రికి తరలించి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలకు అన్యాయంగా అభం శుభం తెలియని చిన్నారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Also Read:చిన్నారి బాలున్ని చితకబాదిన కన్నతల్లి, ఆమె ప్రియుడు

మరో కేసులో శ్రీకాకుళం జిల్లా కు చెందిన లక్ష్మి అనే మహిళ తన భర్త చనిపోడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ కు వచ్చి సనత్ నగర్ లో నివసిస్తోంది. మోతీనగర్ సమీపంలో ని బొబ్బాల గూడ లో నివాసముంటున్న ఈమె చిన్నా అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

 అయితే వీరి అక్రమ సంబంధానికి చిన్నారులు అడ్డుగా వస్తున్నారని వీరిద్దరూ ఎప్పుడూ పిల్లలపై దాడి చేసేవారు. అయితే ఈ క్రమంలో నిన్న లక్ష్మి చిన్న కొడుకు పవన్ (6 ఏళ్లు) చిన్న తప్పు చేశాడని వైర్ తీసుకుని చిన్నా విచక్షణారహితంగా కొట్టాడు.

Also read:అప్పుడే పుట్టిన మగ శిశువును చిదిమేసిన కన్నతల్లి, ఆడపిల్ల పుట్టలేదనే అక్కసుతో...

దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు  సమాచారం అందించడంతో పోలీసులు లక్ష్మిని ఆమె ప్రియుడు చిన్నాను అరెస్ట్ చేశారు.

ఈ చిన్నారి దాడి ఘటనపై బాలల హక్కుల సంఘం స్పందించింది. దాడికి పాల్పడిన చిన్నా పై హత్యాయత్నం కేసు, బాలుడి తల్లి పై జె.జె 75 ప్రకారం రక్షణ, పరిరక్షణ చట్టాలు ప్రకారం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం పోలీసులకు సూచించింది.  బాలుడికి రక్షణ కల్పించాలని బాలల హక్కుల సంఘం తరపున పోలీసులకు, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది.