మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. బంధువుల ఇంటికి వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా... లైంగిక దాడి తట్టుకోలేక అనారోగ్యానికి గురై బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ సంఘటన  ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. దీంతో.. మేనత్త దగ్గర పెరుగుతోంది. ప్రస్తుతం దసరా సెలవలు కావడంతో బాలిక నగర శివారు రామన్నపేటలో ఉంటున్న దగ్గరి బంధువు ఇంటికి వెళ్లింది. మంగళవారం ఆ బాలికకు జ్వరం వచ్చిందని వాళ్లు మేనత్త ఇంటికి తీసుకువచ్చారు.

సాయంత్రానికి బాలిక మరింత క్షీణించింది. విపరీతంగా వాంతులు కూడా చేసుకుంది. రాత్రి పది గంటల సమయంలో జ్వరం ఎక్కువ అవుతోందని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా.. పరీక్షించిన వైద్యులు బాలికకు తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండటాన్ని గమనించారు. అంతేకాకుండా శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.

పరీక్షలు జరపగా... బాలికపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. ఆ కారణంగానే బాలిక అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. ఆస్పత్రిలోచికిత్స పొందుతూనే బాలిక కన్నుమూసింది. బాలికతో ఓ యువకుడు సన్నిహితంగా ఉండేవాడని అతనే  బాలిక మరణానికి కారణమని మేనత్త ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.