చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కన్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు, ఇంటి పక్కన అంకుల్ , తాత వరసయ్యే వాళ్లు... ఇలా ఎవరో ఒకరి రూపంలో చిన్నారులకు ఆపద ముంచుకొస్తోంది. ఇప్పటికే చాలా మంది చిన్నారులు ఈ దారుణ సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. లైంగిక దాడి తట్టుకోలేక చనిపోయిన  చిన్నారులు కూడా ఎందరో ఉన్నారు. పాపం పుణ్యం తెలియని పసి పిల్లలపై కూడా కామ వాంఛ తీర్చుకుంటున్నారు.  తాజాగా ఇలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది.

నాలుగేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడు ఇంత దారుణానికి ఒడిగట్టడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ కుటుంబం వర్నిలో నివాసం ఉంటోంది. గురువారం ఆ కుటుంబానికి చెందిన చిన్నారి(4) వాళ్ల అమ్మ పనిచేసే పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు పలక, బలపం తీసుకొచ్చి ఆడుకుందామని ఆ చిన్నారిని పిలిచాడు. పాఠశాల గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  

తర్వాత ఇంటికి వచ్చిన చిన్నారి... నొప్పితో ఏడుస్తుండగా... గమనించి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. పరిశీలించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులు గ్రామ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.