ఆదివారం ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్పోరేటర్ ఒక్కో కేసీఆర్ కావాలని అప్పుడే పట్టణం రూపురేఖలు మారతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల కోసం ప్రణాళిక రూపొందించాలని, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన జరగనీయరాదని కేటీఆర్ తెలిపారు.

Aslo Read:పట్టణ ప్రగతికి చిన్నారి బలి: గోడ కూలి బాలిక మృతి, పరామర్శించిన ఎర్రబెల్లి

వచ్చే రెండు, మూడు నెలల్లో 400 పబ్లిక్ టాయ్‌లెట్లను నిర్మించాలని ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఏ మొక్క కావాలంటే ఆ మొక్కను అధికారులు అందించాలని, 85 శాతం మొక్కలు కాపాడకపోతే కార్పోరేటర్ ఉద్యోగం పోతుందని కేటీఆర్ హెచ్చరించారు.

పట్టణాల్లో పార్కులు, పచ్చదనానికి 10 శాతం నిధులు కేటాయించాలని, మంచినీరు, మురుగునీరు నిర్వహణపై సమగ్ర ప్రణాళిక తయారు చేయాలన్నారు. ప్లాస్టిక్‌కు ప్రజలను దూరంగా వుంచి.. వాటి స్థానంలో జూట్ సంచులను అందించాలని మంత్రి సూచించారు.

ఖాళీ స్థలాల నిర్వహణలో పక్కాగా వ్యవహరించాలని, సరైన నిర్వహణ చేయని వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఉదయం 5.30 కల్లా సిబ్బంది విధుల్లో ఉండాలని కేటీఆర్ చెప్పారు.

Also Read:వారి పదవులు పోవడం ఖాయం...: మంత్రి హరీష్ రావు

ఇళ్ల నిర్మాణానికి 75 గజాల స్థలం ఉంటే అనుమతి అవసరం లేదని.. 600 గజాల లోపు ఉంటే మాత్రం ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలన్నారు. 21 రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని.. ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని కేటీఆర్ సూచించారు.

ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేస్తామని.. దీనిలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వుంటే వాటిని కూల్చేసి, జరిమానా విధిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.