దేశంలో ఎక్కడా లేని రీతిలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జహీరాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న జర్నలిస్ట్ కాలనీలో ఆయన మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు సైతం కలిసివచ్చారని.. ఆ భావనతోనే సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్ తెలిపారు.

రాష్ట్రంలో 16,868 మందికి అక్రిడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులను జారీ చేశామన్నారు. 12,600 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు మరో 38వేల మంది కలిపి 52,996 మందికి ఆరోగ్య కార్డులు ఇచ్చామని హరీశ్ వెల్లడించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి 100కోట్ల తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని, మానవీయ రీతిలో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. వివిద కారణాలతో మరణించిన 220 మంది పాత్రికేయ కుటుంబాలకు 2.25 కోట్లు మంజూరు చేశామన్నారు.

గాయపడిన వారికి, ఇతర అనారోగ్యాలకు గురైన వారికి 50వేలు, మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు నెలకు 3వేలు చొప్పున పెన్షన్, వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు.

జర్నలిస్టు అంటే ఎండ..వాన..చలి అనేది లెక్క చేయకుండా వృత్తిని నమ్ముకుని సామాజిక బాధ్యతగా.. ప్రభుత్వం ఇటు ప్రజలకు వారధులుగా పనిచేస్తున్నారని మంత్రి కొనియాడారు.

జహీరాబాద్ జర్నలిస్టుల కాలనీ మోడల్ గా నిలవాలని... నాటిన మొక్కను సంరక్షించాలని ఆయన పాత్రికేయులను కోరారు. అనంతరం ఆయన జహీరాబాద్‌లో 60 లక్షల వ్యయంతో నిర్మించిన లింగాయత్ భవనాన్ని ప్రారంభించారు.

అలాగే పట్టణంలో చెత్త సేకరించే ఆటోలు, జేసీబీ, డస్ట్ క్లిన్ మెషిన్‌ను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.