అనంతపురం: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ కార్ల తయారి కంపనీ కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపి పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటై ఉత్పత్తులు మొదలు పెట్టిన 'కియా మోటార్స్' కార్ల పరిశ్రమ తరలిపోతుందన్నది అసత్య ప్రచారమని... ఈ వార్తలను ఖండిస్తున్నట్లు  తెలిపారు. 

ప్రస్తుతం మంత్రి గౌతమ్ రెడ్డి ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పో పాల్గొంటున్నారు. అయితే కియా మోటార్స్ జరుగుతన్న తప్పుడు ప్రచారం గురించి తెలుసుకుని సంబంధిత మంత్రిగా ఆయన అక్కడి నుండే ఓ ప్రకటన చేశారు. 

కియా ఎక్కడికి వెళ్లడం లేదని... సామాజిక మాధ్యమాలు, టీవీ ఛానళ్లు, మీడియాలో ప్రచారం చేస్తున్నదంతా నిరాధారమని  తెలుపుతూ మంత్రి  మేకపాటి  గౌతమ్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. కియా పరిశ్రమ మరిన్ని అనుబంధ సంస్థలతో విస్తరించాలనుకుంటుందే తప్ప రాష్ట్రాన్ని వీడే అవకాశమే లేదని వెల్లడించారు. 

"

కియా పరిశ్రమకు చెందిన యాజమాన్యంతోనూ చర్చించినట్లు మంత్రి స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాలు, అవకాశవాద రాజకీయాలు చేయాలనుకునేవారు ఎన్నిసార్లు ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. 

పారదర్శకతకే పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో  ప్రజలు ఉన్నారని మంత్రి తెలిపారు. బాధ్యతరాహిత్యంతో చేసే దుష్ప్రచారాలను ఎవరూ నమ్మబోరని మంత్రి స్పష్టం చేశారు.