మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన సైరా సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా... ఈ సినిమాని ఓ ఆటో డ్రైవర్ పైరసీ చేయడానికి ప్రయత్నించాడనే కారణంతో... అతనిని చిరంజీవి అభిమానులు అతి దారుణంగా కొట్టారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సైరా సినిమా చూస్తూ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తిపై చిరంజీవి అభిమానులు దాడి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. సైరా సినిమాను ఓ ఆటో డ్రైవర్‌ ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో చూస్తున్నాడు. ఓ సన్నివేశాన్ని తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తుండగా చిరంజీవి అభిమానులు కొందరు పైరసీ చేస్తున్నాడని భావించి దాడి చేశారు. 

అనంతరం అతడిని ఐమాక్స్‌ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించి విచారించి సెల్‌ఫోన్‌ పరిశీలించారు. ఒక్క సన్నివేశాన్ని మాత్రమే సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు గుర్తించారు. పైరసీ కారుడు కాదని తెలియడంతో పోలీసులు ఆటోడ్రైవర్‌ను హెచ్చరించి పంపించేశారు.