కేరళలోని కోజికోడ్‌లో ఆస్తి కోసం సొంత కుటుంబసభ్యులనే ఆ ఇంటి కోడలు హతమార్చిన సంఘటన మరచిపోకముందే అచ్చం అదే తరహా ఘటన ఏపీలో జరిగింది. కాకపోతే ఇక్కడ కుటుంబసభ్యులకు బదులు బయటివారిని డబ్బు కోసం హతమార్చాడో కిరాతకుడు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారిని ఎంచుకున్నాడు. తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని ఎంచుకుని పూజల పేరిట మాయ చేశాడు.

పూజ చేయించి నాణేం ఒకటి దగ్గర ఉంచుకుంటే అపర కుబేరులు అవుతారని చెప్పేవాడు. తీరా పూజలు చేయించుకున్నప్పటికీ ఫలితం రాని వ్యక్తులు నిలదీస్తే పెద్ద పూజ చేయించానని చెప్పి విషం కలిపిన ప్రసాదం ఇచ్చి హతమార్చేవాడు.

Also Read:ఆరుగురిని చంపిన జాలీని కోర్టు వద్ద చూసేందుకు ఎగబడ్డ జనం

ఇతని నిజస్వరూపం ఈ నెల 16న ఓ పీఈటీ హత్యతో వెలుగులోకి వచ్చింది. ఏలూరుకే చెందిన పీఈటీ నాగరాజు ఈ నెల 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటికే అతను మరణించాడు. గుండెపోటుతోనే నాగరాజు మరణించాడని కుటుంబసభ్యులు తొలుత భావించారు. ఐతే ఆయన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తీసుకెళ్లిన రూ.2 లక్షల నగదు, ఒంటిపై గల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా నాగరాజుతో చివరిగా ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది. ముందు నాగరాజు మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వ్యక్తి చెప్పినప్పటికీ.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం చెప్పాడు.

Also Read:ఆ మిస్టరీ మహిళ ఎవరు: జాలీతో కలిసి ఫొటో, ఆ తర్వాత మాయం

అతనికి ప్రసాదంలో విషం కలిపి ఇచ్చి అనంతరం ఒంటిపై వున్న బంగారు ఆభరణాలు, డబ్బును తాను తీసుకున్నట్లు అంగీకరించాడు. పోలీసులు మరింత లోతుగా విచారించగా ఆ వ్యక్తి గతంలో ఇదే తరహాలో ప్రసాదంలో విషం కలిపిచ్చి 8 మందిని చంపినట్లుగా తేలింది.

ఏలూరులో ముగ్గురు , కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురిని ఇలాగే హతమార్చినట్లు నిందితుడు చెప్పాడు. తానిచ్చిన ప్రసాదాన్ని తిన్న వెంటనే వారు మరణించేవారని.. అయితే మృతుల కుటుంబసభ్యులు మాత్రం హార్ట్ అటాక్‌తో చనిపోయినట్లు భావంచేవారని ఆ వ్యక్తి వెల్లడించాడు.