ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి.. అనంతరం దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. అతనే నేరం చేసినట్లు నిరూపితం కావడంతో.. పోక్సో ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు మరో మూడు శిక్షలను కూడా విధించింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా రావూరు మండలం దిండవల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం కోదండరామపురంలోని ఓ రైతు పొలంలో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  2017 జులైలో అతని కుమార్తె అస్వస్థతకు గురైంది. అప్పుడు బాలిక వయసు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. దీంతో... బాలిక తండ్రి.. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాడు.

తిరిగి కూతురిని తీసుకొని ఇంటికి వస్తుండగా... బస్టాండ్‌ వద్ద నిందితుడు(రాపూరి పెదపేరయ్య) అతనితో మాటలు కలిపి మద్యం తీసుకు రావాలని డబ్బులు ఇచ్చాడు. బాలికను అక్కడ ఉంచి ఆమె తండ్రి మద్యం తెచ్చేందుకు వెళ్లగా, బాలికను తీసుకొని పెదపేరయ్య పరారయ్యాడు.
 
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పీసీపల్లి పోలీసులు గాలింపు చేపట్టారు. మూడు రోజులకు గ్రామ సమీప చెరువులో బాలిక మృతదేహం కనిపించింది. ఆమెపై పెదపేరయ్య అత్యాచారం చేసి గొంతునులిమి చంపేశాడని పోలీసులు గుర్తించారు. క్లూస్‌టీమ్‌ ఇచ్చిన ఆధారాలతో పొన్నలూరు మండలం శింగరబొట్లపాలేనికి చెందిన రాపూరి పెదపేరయ్యను నిందితుడిగా గుర్తించారు. 

కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఎన్‌.రమేశ్‌ నిందితుడికి జీవితఖైదుతోపాటు అత్యాచారం చేసినందుకు మరో పదేళ్లు, బాలిక నగలు అపహరించినందుకు మరో మూడేళ్లు, హత్య చేసినందుకు మరో పదేళ్లు జైలు శిక్ష విధించారు.