హరితహారం మొక్కలను నాశనం చేసినందుకు గాను ఓ వ్యక్తికి మున్సిపల్ అధికారులు రూ.30వేల జరిమానా విధించారు. ఈ సంఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... బుధవారం సిద్ధిపేట మిలన్ గార్డెన్ రోడ్డులో బృందావన్ కాలనీ ఎదురుగా ఉన్న హరితహారం మొక్కలను తెలుజూరు బాలయ్య అనే వ్యక్తి పూర్తిగా ధ్వంసం చేశాడు.

మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ తో ఘటనాస్థలిని పరిశీలించారు. మొక్కలను ధ్వంసం చేసిన బాలయ్యకు మున్సిపల్ అధికారులు రూ.30వేలు జరిమానా విధించారు. అంతేకాకుండా అతని చేత 30 మొక్కలను నాటించి.. సంవత్సరంపాటు వాటి సంరక్షణ బాధ్యతలను అతనికే అప్పగించడం విశేషం.

కాగా... ఇటీవల కరీంనగర్ లో హరితహారం మొక్కలను మేకలు తిన్నాయని...వాటిని అరెస్టు చేసి జరిమానా విధించారు. మేకలనే వదలని అధికారులు మనుషులను వదలుతారా..? అందుకే అతనికి రూ.30వేల జరిమానా విధించారు.