కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం  సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనారాయణపురం శివారులోని పొలం గట్టుపై ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. సోమవారం తెల్లవారుజామున స్థానిక రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పోలినేడి సత్యనారాయణ (42) స్థానికుడిగానే నిర్దారించుకున్న పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంఘటనా  స్థలం వద్ద పరిస్థితులను చూస్తుంటే నిన్న సాయంత్రం వర్షం కారణంగా సత్యనారాయణ చెట్టు కిందకు చేరుకున్నట్లున్నాడు. అయితే చెట్టు పక్కన నిలిపివుంచిన  ద్విచక్రవాహనంపై పిడుగు పడగా ఆ శబ్దం, వేడికి అతడి  జేబులోని సెల్ ఫోన్ పేలినట్లుంది. దీంతో అతడు మృతిచెందివుంటాడని పోలీసులు ప్రాథమికంగా  నిర్దారించారు.

 అతడి జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలి చుట్టు పక్కల చెల్ల చెదురుగా పడింది. అలాగే సెల్ ఫోన్ పెట్టుకున్న జేబు వద్ద పూర్తిగా చిరిగి పోయి వుంది. దీంతో పిడుగుపాటు, సెల్ ఫోన్ పేలుడే అతడి  మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.