కర్నూల్: రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆంధ్ర ప్రదేశ్  అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ అన్నారని ఆ ప్రాంత విద్యార్ధి సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కర్నూల్ ను మరో రాజధానిగా ప్రకటించడమే కాదు హైకోర్టును ఇక్కడే ఏర్పాటుచేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అయితే అమరావతిలో ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని  వెనక్కితీసుకుంటే రాయలసీమలో ఉద్యమం మొదలవుతుందని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.  

ఇదే అంశంపై కర్నూలు న్యాయవాదులు కూడా తమ గళం విప్పారు. జుడిషియల్ రాజధానిగా ముఖ్యమంత్రి కర్నూలు ప్రకటించడం ఆనందంగా వుందని...అయితే ఇతర ఏ ప్రాంతాలలో బెంచీలు ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో హైకోర్టును కర్నూల్ లోనే  వుండేలా చూడాలని డిమాండ్ చేశారు.  హైకోర్టుతో పాటు మినీ సెక్రటరియేట్ కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తే సీమ అభివృద్ధి చెందడానికి పూర్తిగా దోహదపడుతుందని లాయర్లు పేర్కొన్నారు. 

read more  అమరావతిలో ఉద్రిక్తత... మీడియా, పోలీసులపై దాడి వారిపనే...: ఐజి వినీత్ బ్రిజల్

ఇతర ప్రాంతాల నేతలు, న్యాయవాదులు దీనిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండి పడుతున్నారు. హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించితే ప్రత్యేక ఉద్యమానికి సిద్ధం అవుతారని హెచ్చరిస్తున్నారు. రాజధాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు స్థానిక విద్యార్థులతో కలిసి బిర్లా గేట్ వద్ద మానవహారంగా ఏర్పడి ఆందోళనకు దిగారు. కేబినెట్ భేటీలో జగన్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టుతో పాటు రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

read more  ఆ నిర్ణయానికి స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండం: స్పీకర్ తమ్మినేని

ఒకవేళ మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుంటే రాయలసీమ జిల్లాల వారీగా ప్రతిరోజు ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా వెనకబడ్డ రాయలసీమ కోలుకోవాలంటే రాజధాని, హైకోర్టు రెండూ ఏర్పాటు చేయాలని  విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.