కర్నూల్: పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జరిగే అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను జిల్లా ఎస్పీ పకీరప్ప ప్రారంభించారు. ఈ  వారోత్సవాల్లో కేవలం పోలీసులే కాదు ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఈ వారోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం  పోలీసు కార్యాలయ పేరడ్ మైదానంలో ఆయుధాల ప్రదర్శన ఏర్పాటుచేశారు. అలాగే స్కూల్ విద్యార్థులకు   వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ రెడింటిని ఎస్పీ ప్రారంభించారు. 

ఓపెన్ హౌస్ లో పోలీసుల ఆయుధాలపై స్వయంగా ఎస్పీ విద్యార్థులకు అవగహాన కల్పించారు. బాంబ్ డిస్పోజబుల్ టీం, ఫింగర్ ప్రింట్స్, ట్రాఫిక్ , కమ్యూనికేషన్ తదితర అంశాలకు సంబంధించిన విషయాలను విద్యార్దులకు పోలీసు సిబ్బంది వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పోలీసు పాత్ర మరియు పోలీసు , ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకత పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. 

రేపు(బుధవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో మెగా రక్తదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఎల్లుండి అంటే  అక్టోబర్ 17న ఉదయం 6.30 గంటలకు జిల్లా  పోలీసు కార్యాలయ కొండారెడ్డి బురుజు నుండి మారథాన్ పరుగు ప్రారంభం అవుతుందని ఎస్పీ తెలిపారు.

ఈ రక్త దానం, మారథాన్ లో మీడియా, యువకులు, విద్యార్దులు, క్రీడాకారులు, ప్రజలు, ఉద్యోగులు, పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎస్పీ పకీరప్ప విజ్ఞప్తి చేశారు.