Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు వైసిపిలో అంతర్యుద్ధం... స్థానిక ఎన్నికల అధికార పార్టీ గట్టెక్కేనా...?

కర్నూల్ జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య అంతర్యుద్దం తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం పార్టీకి నష్టం చేస్తుందని ఆ జిల్లాలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నట్లే సమాచారం. 

kurnool  disrict YSRCP Leaders cold war
Author
Kurnool, First Published Jan 19, 2020, 5:33 PM IST

అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా కర్నూలు జిల్లాలో రాజకీయం ఎప్పుడు వేడి రాజుకునే ఉంటుంది. ఎక్కడైనా అధికార విపక్షాలు మనస్పర్థలతో మాటల తూటాలు పేల్చుకోవటం, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా గమనిస్తూ ఉంటాం. కానీ కర్నూలు జిల్లాలో ఆ పాత్ర ప్రతిపక్షం సరిగా చేయడం లేదని కొందరు అధికార పార్టీ నేతలు భావించినట్లున్నారు. అందుకే ఆ పాత్ర ను తమ భుజస్కందాలపై వేసుకున్నారు.

అధికార పార్టీలోని నేతలు ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకొని ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా ఏకంగా దాడులకు ప్రతి దాడులు కూడా దిగుతున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే ఈ పరిస్థితి రావడంతో కార్యకర్తలు పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే వీటిపై దృష్టి సారించిన జిల్లా నేతలు అధిష్టానం వద్దకు వీటిని తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. నేతలు తమ పంథాను మార్చుకోలేదట. దీంతో కార్యకర్తలకు పరిస్థితి అర్థం కాకుండా తలలు పట్టుకుంటున్నారట.

జిల్లాలోని మండల స్థాయిలో ఈ వ్యవహారం ఎక్కువగా తలనొప్పులు ఉంటే నందికొట్కూరు ,కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాలలో శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్తల మధ్యలోనే సమన్వయం పూర్తిగా కొరవడి పోయింది. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది.

కోడుమూరు శాసనసభ్యుడు సుధాకర్ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి మధ్య సమన్వయ సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. శాసన సభ్యునిగా ఉన్న సుధాకర్ మాట సాగ నివ్వడం లేదని... అతని ప్రాముఖ్యతను తగ్గిస్తూ వస్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్ వర్గం తీవ్రంగా ఆరోపిస్తుంటే... నియోజకవర్గంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి  నియోజకవర్గ సమన్వయకర్త తో శాసన సభ్యుడు సరైన సమన్వయం చేసుకోలేక పోతున్నాడు అని ప్రత్యారోపణ చేస్తున్నారు హర్ష వర్ధన్ రెడ్డి వర్గీయులు. 

Video: అమరావతి కోసం... ఎమ్మెల్యే క్వార్టర్స్ 13వ అంతస్తుపైకెక్కి ముగ్గురు యువకులు...

తాము హర్ష వర్ధన్ రెడ్డి అనుచర వర్గంగా ఉన్నందుకు తమ అసలు పట్టించుకోవడం లేదని తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ పథకాలలో కోత విధించడమే కాకుండా.... పార్టీలో తమ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గి స్తున్నారని మండిపడుతూ అనేక ఆరోపణలు చేశారు. అధికార పార్టీకి చెందిన వారు కొందరు ఏకంగా శాసనసభ్యుడు సుధాకర్ ఫ్లెక్సీలు తగలబెట్టారు  కోడుమూరు బస్టాండ్ లో ఓ ప్రారంభోత్సవం లో అధికార పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఏకంగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇటువంటి వాతావరణంలో పార్టీ స్థానిక సంస్థల సమరం లో ముందుకు పోతే పరిణామాలు మాత్రం ప్రతికూలంగా వస్తాయని అంచనాలు వేస్తున్నారు అధికార పార్టీ నేతలు.

ఇక నందికొట్కూరులో అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నందికొట్కూరు శాసనసభ్యుడు ఆర్థర్, నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యపోరు సాగుతోంది. ప్రతి విషయానికి ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కార్యకర్తలు పూర్తిగా సతమతమై పోతున్నారు. జిల్లా నేతలు విషమిస్తున్న పరిస్థితిని అధినేత వద్ద ఫిర్యాదు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇద్దరినీ కూర్చొ పెట్టుకొని సర్ది చెప్పినా సమస్యలు ఎటువంటి మార్పు రాలేదు.

 తమ వర్గానికి పనులు జరగాలంటే తమ వర్గానికి జరగాలంటూ ఇరు వర్గం నేతలు గట్టి పట్టు పడుతున్నారు. దీంతో ఏ వర్గానికి పనులు చేసి పెట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు సమన్వయకర్తల కంటే శాసనసభ్యులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో అధికారులు ఎమ్మెల్యే ఆర్థర్ తో సమన్వయం చేశారు. ఆ పరిస్థితి తో తన వర్గానికి ఎటువంటి పనులు జరగకపోవడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీ మారుతున్నారంటు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

అయితే తాను ఏ పార్టీ మారడం లేదని వైసీపీలోనే కొనసాగుతానని, తనను నమ్ముకున్న వారికి మాత్రం న్యాయం చేయలేక పోతున్నాం... అని సిద్దార్ధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇద్దరి సమన్వయంతో ఊహించని మెజారిటీ సాధించిన అధికార పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థానిక సమరానికి వెళితే మాత్రం పరిస్థితులు తిరగ పడతాయని విశ్లేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

read more  రేపే జనసేన పీఏసి అత్యవసర సమావేశం... చర్చించే అంశాలివే

కర్నూలు నియోజకవర్గం వారి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. స్థానిక శాసనసభ్యుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కి పెత్తనం అంతగా సాగడం లేదు.  ఎన్నికలకు ముందు వైసీపీ లోకి వచ్చిన మోహన్ రెడ్డి తన వర్గానికి పనులు జరగడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్ని తానై పార్టీ నేతలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  దీనిని ఆఫీజ్ వర్గం పూర్తిగా తప్పుబడుతోంది.  ఎన్నికల ముందు కాకుండా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని తేల్చిచెప్పింది. దీంతో అధికారిక కార్యక్రమాల్లో ఒకరికొకరు బహిరంగంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. 

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అతి తక్కువ మెజారిటీ సాధించిన నియోజకవర్గం కర్నూలు.  తాజా పరిస్థితి అలాగే కొనసాగితే స్థానిక సమరంలో పరిస్థితి తలకిందులుగా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అనేది ఆ పార్టీ నేతల బలమైన వాదన

. మిగిలిన చోట్ల మండల నేతల మధ్య మనస్పర్థలు వస్తున్నా వాటిని జిల్లా నేతలు పరిష్కరిస్తారు. నియోజకవర్గ స్థాయిలోకి సంబంధించి తమ వల్ల కాక చేతుల ఎత్తేసి పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తున్నారు. మరి గీత దాటుతున్న జిల్లా నేతలపై ఎటువంటి చర్యలు తీసుకుంటాడో వాటిని స్థానిక సమరానికి ఎలా ఉపయోగించుకుంటాడో ముందు ముందు తేలాల్సిఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios