హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా... మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం కురవడం గమనార్హం. చాలా ప్రాంతాల్లో మోకాళ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. చాలా మంది ఇళ్లల్లోకి కూడా వర్షపు నీరు చేరింది. ఇక ట్రాఫిక్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.   కాగా... 111ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో ఇంత భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

1908వ సంవత్సరంలో సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో వాన కురవడం తొలిసారి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు, చెరువులు పొంగిపొర్లాయి. రహదారులు గోదారిని తలపించాయి. రహదారుల మీదకు నాలా నీరు పొంగిపొర్లడంతో.. రోడ్లన్నీ జలయమం అయ్యాయి. దీంతో.. కిలో మీటర్ల మేర నీరు నిలిచిపోయింది. మంగళవారం కురిసిన వర్షం రిక్డార్‌ని బ్రేక్ చేసింది. 

మంగళవారం కురిసిన వర్షంతో అత్యధికంగా సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో 12.1 సెంటమీటర్ల వర్ష పాతం నమోదవ్వగా... ఉప్పల్ లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  ఇక అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, మోహదీపట్నం, చార్మినార్, కుత్బుల్లాపూర్, అంబర్ పేట, గోషా మహల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మూసాపేట, శేరిలింగంపల్లి,  జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, యూసుఫ్ గూడ, అమీర్ పేట ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.

1908లో సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లో 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ స్థాయిలో.. మరలా ఇప్పుడే వర్షం కురిసింది. కాగా.. మరో రెండు రోజుల పాటు ఈ వర్షం జోరు కొనసాగే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.