హుజూర్ నగర్:  తెలంగాణలోని హుజూర్ నగర్ శాసనసభ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గట్టు శ్రీకాంత్ రెడ్డిని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దాంతో శ్రీకాంత్ రెడ్డి హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వడానికి సమ్మతించారు. ఇప్పటికే సిపిఐ మద్దతును టీఆర్ఎస్ పొందింది. కాంగ్రెసును ఓడించాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు..

హుజూర్ నగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ర్యాలీ నిర్వహించారు. దసరా పర్వదినం తర్వాత ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. 

కాంగ్రెసు తరఫున తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బిజెపి, తెలుగుదేశం పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. 

సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి శానంపూడి సైదిరెడ్డిపై 7 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆయన నల్లగొండ లోకసభ సీటు నుంచి విజయం సాధించారు. దాంతో హుజూర్ నగర్ సీటుకు రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.