హుజూర్ నగర్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం సాయంత్రం హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ప్రచారం సాగించారు. తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆయన ర్యాలీ నిర్వహించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెసు ఓడిపోతుందని వదినమ్మకు తెలుసునని ఆయన కాంగ్రెసు అభ్యర్థి పద్మావతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

కాంగ్రెసు ఢిల్లీతో పాటు గల్లీలో కూడా లేదని, అది మునిగిపోయే నావ అని ఆయన అన్నారు. హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎదరాలని ఆయన అన్నారు. కాంగ్రెసు చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి చీఫ్ లక్ష్మణ్ కుమ్మక్కై టీఆర్ఎస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

మంత్రిగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్లు అధికారంలో ఉండి హుజూర్ నగర్ ను ఉత్తమ్ ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ఈ ప్రాంతంలో బలంగా ఉన్నారని, టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి సైదిరెడ్డిని గెలిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలది అహంకార ధోరణి అని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ శంకరమ్మను ఆయన పెద్దమ్మగా సంబోధించారు. కేటీఆర్ ర్యాలీలో సైదిరెడ్డితో పాటు శంకరమ్మ కూడా పాల్గొన్నారు.