ఖమ్మం: ఒకే  గ్రామానికి చెందిన వారిద్దరు ప్రేమించుకుని ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అనంతరం అతడిలో మృగాడు బయటకు వచ్చాడు.  భార్య వుండగానే మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తూ వేధించడం ప్రారంభించారు. ఇలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడి చేతిలో మోసపోయాన్న తీవ్ర మనస్థాపంతో సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో గ్రామానికి చెందిన మల్లీశ్వరి, ధరావత్‌ లక్ష్మణ్‌ లు ఎంతోకాలంగా ప్రేమించుకుని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత లక్ష్మణ్ నిజస్వరూపం బయటపడింది. అతడు మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని  గుర్తించింది మల్లీశ్వరి. ఈ విషయంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

read more హైకోర్టు సీజే ఎదుట కాశీం: కొనసాగుతున్న వాదనలు

ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా భార్యభర్తలు వేరుగా వుంటున్నారు. ప్రేమించివాడి చేతిలో  మోసపోయి ఒంటరిగా బ్రతకలేక తీవ్ర మనస్థాపంతో మల్లీశ్వరీ దారుణమైన నిర్ణయం తీసుకుంది. శనివారం ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

మల్లీశ్వరి  మృతదేహాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.