కృష్ణా జిల్లాలో చందర్లపాడు మండలం ముప్పాళ్ళ లో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కొడుకునే కత్తితో పొడిచి హత్య చేశాడు. అమ్మ కావాలని అడిగిన పాపానికే యువకున్ని తండ్రి హతమార్చినట్లు తెలుస్తోంది. 

ముప్పాళ్ల నివాసి ఆదాంతో గొడవపడి ఆయన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో అతడితో పాటు కొడుకు రవి మాత్రమే వుంటున్నారు. ఈ క్రమంలోనే తల్లికి నచ్చజెప్పి తీసుకురావాలని కొడుకు తండ్రిని సూచించాడు.

అయితే కొడుకు తననిలా ప్రశ్నించడం ఆదాంకు నచ్చలేదు. దీంతో యువకుడైన కొడుకుతో గొడవకు దిగాడు. కోపంలో తాను ఏం చేస్తున్నాడో కూడా మరిచిపోయిన తండ్రి కన్న కొడుకును కత్తితో నరికి చంపాడు. 

ఈ దారుణం గురించి స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా  స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయి లొంగిపోయాడు. దీంతో మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టు కోసం తరలించారు. అలాగే మృతుడి తల్లితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఈ దారుణం గురించి సమాచారం అందించారు.