అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి తర్వాత తండ్రి లాంటి సొంత అన్నయ్యే తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. పుట్లూరు మండలం శనగలగూడురు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ తన పొలాన్ని అన్న రామాంజినేయులు అనే వ్యక్తికి 10 సంవత్సరాలుగా కౌలుకు ఇస్తున్నాడు.

అయితే పంట పండించుకుంటూ అన్నయ్య కౌలు డబ్బు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్యా గత కొంతకాలంగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది రాజ్‌కుమార్ తన భూమిని అన్నయ్యకు కాకుండా గ్రామానికి చెందిన ఇతరులకు కౌలుకు ఇవ్వడంతో రామాంజినేయులు జీర్ణించుకోలేకపోయాడు.

Also Read:పరాయి మహిళతో భర్త వివాహేతర సంబంధం: పెళ్లి చేసిన భార్య

దీనికి తోడు రాజ్‌కుమార్‌ పొలాన్ని కౌలుకు తీసుకున్న వ్యక్తులు అందులో పప్పుశనగను సాగుచేశారు. అయితే తీవ్ర వర్షాభావం వల్ల పప్పుశనగకు పొలం పక్కనే ఉన్న నీటికుంట ద్వారా నీటిని అందించేందుకు కౌలుదారులు ప్రయత్నించగా రామాంజినేయులు అడ్డుకున్నాడు. దీంతో వారు విషయాన్ని రాజ్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.

అన్నతో తాడో పేడో తేల్చుకోవాలని భావించిన రాజ్‌కుమార్ తన కౌలుదారులు వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలను తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో రామాంజినేయులు వారి ముగ్గురి కళ్లలో కారం కొట్టి.. తన కుమారుడితో కలిసి రాజ్‌కుమార్ చంపి అతని తలను నరికి పొలాల్లోకి విసిరేశారు.

Also Read:నిత్య పెళ్లికొడుకు అరెస్ట్: 23 ఏళ్లలో నాలుగు పెళ్లిళ్లు

ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన చుట్టుపక్కల పొలాల్లోని వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. అటు భర్త మరణవార్తను తెలుసుకున్న రాజ్‌కుమార్ భార్య లక్ష్మీదేవి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయింది.