అమరావతి:  ఎనిమిదేళ్ల తర్వాత కడప రైతుల కష్టం తీరింది. ఏళ్లనాటి రబీ పంట బీమా క్లెయిములను ఎట్టకేలకు చెల్లించారు. దాదాపు 24,641 మంది రైతులకు రూ.119.44 కోట్లు సీఎం జగన్ చేతులమీదుగా చెల్లించారు. ఈ సొమ్మును రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమం క్యాంపు కార్యాలయంలో జరిగింది. 

అనంతరం సంబంధిత రైతులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్వయంగా మాట్లాడారు. కడపజిల్లాలోని  తొండూరు, సింహాద్రిపురం, వీరపునాయనిపల్లె, వేంపల్లె, పులివెందుల, వేముల, కమలాపురం మండలాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా తమ 8 సంవత్సరాల నిరీక్షణకు ఎట్టకేలకు ముగింపు పలికినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు రైతులు. ఈ నిర్ణయం తమ కుంటుంబాల్లో  సంతోషాన్ని నింపిందన్నారు. రైతు ఈ రైతుభీమా సొమ్ముకోసం గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించామని రైతులు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్న సమయంలో కూడా డబ్బులు ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రజలెవ్వరూ కూడా బయటకు రాని సందర్భంలో కూడా డబ్బు ఇప్పించి నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

అరటి పంట విక్రయాల్లో సమస్యలు తీరాయా? లేదా? అని  రైతులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్తులను కూర్చోబెట్టి ఈ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు అధికారులు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు అధికారులు

ఢిల్లీ, కాన్పూర్‌ లాంటి మార్కెట్లకు ఇక్కడనుంచి అరటి వెళ్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్లు తెరుచుకున్నాయని, సరుకును బయటకు పంపుతున్నామని తెలిపారు. రైతులకు మంచి రేటు వచ్చేలా చూడాలని అధికారులను అదేశించారు సీఎం. రానున్న రోజుల్లో రైతులకు ఇచ్చే రేట్లు పెరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.