Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ అలా చేస్తే... జగన్ అంతకుమించి చేస్తున్నారు...: చంద్రబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం  అసెంబ్లీని తమ ఇష్టానుసారం నడిపిస్తోందని టిడిపి అదినేత చంద్రబాబు ఆరోపించారు. సభా మర్యాదను కూడా పాటించకుండా ప్రతిపక్ష నేేతనైన తనను సభలోకి రాకుండా మార్షల్స్ తో అడ్డుకున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.  

chandrababu fires on ap cm  jagan
Author
Amaravathi, First Published Dec 12, 2019, 8:56 PM IST

గుంటూరు: మీడియా స్వేచ్చను హరించివేస్తున్న వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 2430పై గవర్నర్  బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేసినట్లు టిడిపి అధినేత చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా మీడియాకు సంకెళ్లు వేసిందని... ఇదే విషయాన్ని గవర్నర్ కు వివరించినట్లు తెలిపారు. వెంటనే మీడియాపై ఆంక్షలు ఎత్తివేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. 

గతంలో ఇలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో జీవో 938 తీసుకువచ్చారని...దీనిపై మీడియా సంస్థలు, పాత్రికేయ సంఘాలతో కలిసి టిడిపి పోరాటం చేసినట్లు గుర్తుచేశారు. దీంతో వైఎస్సార్ ఆ జీవోను వెనక్కి తీసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. 

మళ్లీ ఇప్పుడు మీడియా గొంతునొక్కేందుకు  జీవో 2430ను వైసిపి ప్రభుత్వం తెచ్చిందన్నారు. అప్పటి జీవో 938లో చర్యలు తీసుకునే అధికారం కేవలం కమిషనర్  కు మాత్రమే ఉందని... కానీ ఇప్పుటి జీవో 2430లో  అన్నిశాఖలకు ఆ అధికారం ఇచ్చారన్నారు. సోషల్ మీడియాను కూడా దీని పరిధిలోకి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. 

‘‘మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, బెదిరించి చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నదే’’ వైసిపి నేతల లక్ష్యంగా  కనిపిస్తోందని ఆరోపించారు.
జీవో 2430కి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయాన్నే శాసన సభ వద్ద ప్రొటెస్ట్ చేశామని... అందుకే తమపై దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. సభలో కూడా దీనికి నిరసనగా మేము వాకౌట్ చేశామని తెలిపారు.

read more షోకాజ్ నోటీస్: పవన్ కల్యాణ్ మీద ఎమ్మెల్యే రాపాక తిరుగుబాటు

 గతంలో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను బంద్ చేయడంపై ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. తనిఖీ బృందాలను పంపి విచారణ  జరిపి చివరికి జరిమానా కూడా విధించిందన్నారు. కానీ ఈ వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా తయారైందని... దానిని కూడా లెక్కచేయడం లేదన్నారు. అసెంబ్లీ ప్రసారాలు చేయనివ్వకుండా ఇప్పుడు  మూడు చానళ్లకు అడ్డం పడ్డారని అన్నారు.

వీటన్నింటిపై ఇవాళ ప్రొటెస్ట్ చేశారని అన్నారు. నెల్లూరులో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పై దాడి చేశారని ఆరోపించారు. తునిలో ఒక విలేకరిని ఏకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలలో ఇంకో విలేకరిపై దాడిచేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. గత 6నెలల్లో జర్నలిస్ట్ లపై దాడులు పెరిగిపోయాయని... దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. 

అసెంబ్లీలో ఏదైనా వీడియో వేయాలంటే స్పీకర్ పర్మిషన్ తో వేయాలి కానీ వీళ్లే  స్పీకర్ ను పక్కన పెట్టి వీడియో వేస్తున్నారని అన్నారు. అది కూడా ఈ రోజు వీడియో  వేయకుండా నిన్నటి వీడియో వేసి చూపించారని అన్నారు. ఈ రోజు అసెంబ్లీ గేటు వద్ద అసలు ఏం జరిగిందో తన వద్ద ఉన్న వీడియోను చంద్రబాబు స్క్రీన్ పై వేసి చూపించారు.

తాను పేపర్లు తీసుకుని అసెంబ్లీ లోనికి పోతుంటే అపోజిషన్ లీడర్ ను అనికూడా చూడకుండా అడ్డుకోవడం... అందుకు మీడియానే ప్రత్యక్ష సాక్షిగా  వున్నారని అన్నారు.  
ఎంత పొగరుబోతుగా వ్యవహరిస్తున్నారు..?  అని ప్రశ్నించారు.

''కేవలం ‘ఉన్మాది’ అంటే వీళ్లకు ఉలుకు వచ్చింది... మరి 650 మందిపై దాడులు చేయడం ఉన్మాదం కాదా..? మాజీ స్పీకర్ కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించడం ఉన్మాదం కాదా..? వందలాది మందిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టడం ఉన్మాదం కాదా..? కరెంటు స్థంభాలకు, నీళ్ల ట్యాంకులకు, ప్రభుత్వ భవనాలకు, చివరికి సమాధులకు కూడా వైసిపి రంగులు వేయడం ఉన్మాదం కాదా..? ఇళ్లు కూల్చేయడం, ఆర్ధికమూలాలు దెబ్బతీయడం, చివరికి ప్రజావేదిక కూల్చేయడం ఉన్మాదం కాదా..? ఇవన్నీ చూస్తుంటే, ఉన్మాదం అనాల్నా..? తలపొగరు అనాల్నా...?'' అంటూ విరుచుకుపడ్డారు.  

తనను తిడుతూ వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలిపారు. గతంలో తాము ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే చైతన్య, నారాయణ బిజినెస్ పెంచడానికి  తెచ్చామన్నారు... ఈ రోజు మేమేదో ఇంగ్లీషు మీడియం వద్దని అంటున్నట్లు అబద్దాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  మళ్లీ నారాయణ, చైతన్య లాభాల కోసమే వద్దని అంటున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

''ఏ మీడియం అనేది ఛాయిస్ పిల్లలకివ్వండి, తల్లిదండ్రులకు ఇవ్వండి.. వాళ్లనెత్తిన ఏదీ బలవంతాన రుద్దవద్దండి. ఇంగ్లీషు మీడియం ఎంత అవసరమో, నాలెడ్డ్ అంతే అవసరం..  మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారంటే అది నాలెడ్జ్ వల్లే సాధ్యం అయ్యింది. వైసిపి నేతలు తామేదో పేదలను ఉద్దరిస్తున్నాం, టిడిపి ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు అంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు.'' అని తెలిపారు.

తాను రాజకీయాల్లోకి రాకముందే ఈనాడు, ఆంధ్ర జ్యోతి వచ్చిందని అన్నారు. సాక్షి పనికిమాలిన పేపర్ అని సీఎం ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. సాక్షి మీది కాదని చెప్పగలరా..?అని నిలదీశారు. 

video: మీడియా స్వేచ్చను కాపాడండి... గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

కొత్తగా వచ్చిన ఛీప్ మార్షల్ చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారని... మహిళా ఎమ్మెల్సీలను అరచేతులు చూపమనడం దారుణమన్నారు. ఈరోజు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి రాకుండా అడ్డుకోవడం, ఏవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతపట్ల వ్యవహరించారో మీడియానే సాక్షిగా వుందన్నారు. ఛీఫ్ మార్షల్ పై, ఇతర మార్షల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు వినతి అందజేశామని తెలిపారు. 

''తక్షణమే మీడియాపై దాడులు ఆపాలి. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిళ్లు మానుకోవాలి. యథావిధిగా అసెంబ్లీ ప్రసారాలు చేసుకునే 3చానళ్లను అనుమతించాలి. స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోర్త్ ఎస్టేట్ మీడియా స్వేచ్ఛ కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అదే విషయం గవర్నర్ కు చెప్పాం. తన పరిధిలో ఉన్నంతవరకు చర్యలు తసుకుంటామని గవర్నర్  మా బృందానికి చెప్పారు'' అని చంద్రబాబు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios