జహీరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియమితులవడంపై జహీరాబాద్ బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఝరాసంఘం మండల బిజెపి నాయకులు సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు నాగేష్ పాటిల్ మాట్లాడుతూ... సంజయ్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి అధ్యక్షతన బిజెపి తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందన్న నమ్మకం వుందన్నారు. అలా పార్టీని ముందుకు నడిపించడంలో ఆయనకు ప్రతి బిజెపి నాయకుడు, కార్యకర్తలు సహాయసహకారాలు అందించాలని కోరారు. 

భారతీయ జనతాపార్టీ గురించి అవాకులు, చవాకులు పేలే టీఆర్ఎస్ నాయకులకు సరయిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.  ముఖ్యంగా సీఎం కేసీఆర్ కు అతని బాషలోనే సమాధానం చెప్పగల నాయకులు బండి సంజయ్ అని... దమ్ముంటే ఇప్పుడు బిజెపి సత్తా ఏంటో చూపిస్తాం కాస్కో అంటూ నాగేష్ సవాల్ విసిరారు. 

రాష్ట్రంలో విద్యార్ధుల సమస్యలపై  పోరాడుతున్న ఏబివిపి విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించారు. అసెంబ్లీ వద్ద విద్యార్థులను పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా చితకబాదడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూశారని అన్నారు. సమస్యలను పరిష్కరించమని నిరసనకు దిగిన తమ బిడ్డలను అలా చితబాదడాన్ని ప్రతి ఒక్కరు తప్పుబడుతున్నారని అన్నారు. కేసీఆర్ అసలు స్వరూపమేమిటో ఒక్కోటిగా బయటపడుతోందని... వచ్చే ఎన్నికల నాటికి అన్ని బయటపడతాయని అన్నారు. అప్పటివరకు బండి సంజయ్ సారథ్యంలో బిజెపి కూడా బలపడుతుందని... అప్పుడు టీఆర్ఎస్ ను మట్టికరిపించడం ఖాయమన్నారు.

ఇక జహిరాబాద్ ప్రాంతంలోనూ బిజెపి జాతీయ ఐటీ సెల్ కన్వీనర్ జంగం గోపి ఆద్వర్యంలో రోజురోజుకు బలోపేతం అవుతున్నట్లు నాగేష్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ వారి సమస్యలపై పోరాడటంతో గోపి ముందుంటున్నారని అన్నారు. అటు రాష్ట్రంలో సంజయ్,  నియోజకవర్గంలో గోపి పార్టీని బలోపేతం చేయగలరన్న నమ్మకం వుందన్పారు. 

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో బిజెపి సత్తా చాటడం ఖాయమని నాగేష్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు బిజెపి షాకిస్తుందని జోస్యం చెప్పారు. అందుకోసం ఇప్పటినుండే సంజయ్ సారథ్యంలో తామంతా పనిచేస్తామని... అవసరమైతే ప్రతి జిల్లానుండి బిజెపి శ్రేణులు హైదరాబాద్ కు తరలడానికి సిద్దంగా వుంటాయన్నారు. బిజెపి కోసం శక్తివంచన లేకుండా పనిచేయడానికి సిద్దమని నాగేష్ పేర్కొన్నారు.