అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జన గణన-2021 కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని  రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని సమావేశ మందిరంలో సీఎస్ అధ్యక్షతన జనాభా గణన-2021పై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా 2011 జనాభా లెక్కల విధానాలను అధికారులను అడిగి వివరంగా తెలుసుకున్నారు.  2011 జనగణనలో సమగ్ర కుటుంబ సర్వే, జనగణన వివరాలను  తెలుసుకున్నారు.

ఈ 2021లో సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించి జనగణన విధానాలను రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2021లో జనాభా గణన చేసేందుకు తీసుకున్న చర్యలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సీఎస్ వివరించారు.  ఈ విషయాన్ని జనగణన డైరెక్టర్ కె.ఇలంభారతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

గతంలో పేపర్ విధానం ద్వారా జనగణన వివరాలను సేకరించడం జరిగిందన్నారు. 2020లో పేపర్ తో పాటు మొబైల్ యాప్ లో మరియు స్వీయగణన ద్వారా జనగణన వివరాలు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. జనగణనకు సంబంధించిన సర్వర్ కు ఈ వివరాలు అనుసంధానించబడతాయని వివరించారు. తద్వారా త్వరితగతిన తుది వివరాల జాబితా సిద్ధమవుతుందన్నారు. 

రాష్ట్రస్థాయిలో దీన్ని పర్యవేక్షించేందుకు నోడల్ డిపార్ట్ మెంట్ జీఏడీ (జీపీఎం అండ్ ఏఆర్),  జిల్లాస్థాయిలో కలెక్టర్ తో పాటు క్షేత్రస్థాయిలో కార్పొరేషన్ కమిషనర్లు, తహసిల్ధార్లు ఉంటారు. వివరాల సేకరణలో ఉపాధ్యాయులు మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానిక సంస్థల అధికారులు ఉంటారని వివరించారు.  

read more  టిడిపి నూతన కార్యాలయం ప్రారంభం... తొలిరోజే టీడిఎల్పీ సమావేశం

ఈ జనగణన రెండు దశల్లో జరుగుతుందన్నారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో  45 రోజుల పాటు  రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వ్యవధి మించకుండా మొదటి దశలో ఇంటి గణన, గృహాలకు సంబంధించిన గణన వివరాలను సేకరిస్తారు. అదే విధంగా రెండో దశలో ఫిబ్రవరి 9, 2021 నుండి  ఫిబ్రవరి 28వ తేదీ వరకు జనాభా వివరాలను సేకరించి నమోదు చేస్తారు. 

28 ప్రశ్నలతో కూడిన నమోదు వివరాల పత్రం రూపొందించినట్లు తెలిపారు. నాలుగు విధాలుగా అంటే జనాభా, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, వలస వంటి తదితర వివరాల సేకరణ జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు. ప్రయోగాత్మకంగా విజయనగరం (భోగాపురం మండలం), అనంతపురం(ఆత్మకూరు మండలం), గుంటూరు (నరసరావుపేట మండలం) జిల్లాల నుండి ఒక్కొక్క ప్రాంతాన్ని(మండలం) ఎంచుకొని వివరాలు నమోదు కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. 

జాబితా తయారీ విషయంలో గతంతో పోలిస్తే  కేవలం సంవత్సరం వ్యవధిలోనే తుది జాబితాను తయారు చేయడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే జాతీయస్థాయిలో ముగ్గురికి జాబితా సేకరణ విషయంలో శిక్షణ ఇచ్చామన్నారు. నవంబర్ 25వ తేదీ నుండి డిశెంబర్ 7వ తేదీ వరకు 58 మంది రాష్ర్ట  ప్రభుత్వ అధికారులకు హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ సెంటర్ లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అనంతరం 2020వ సంవత్సరం జనవరి నెలలో సుమారు 2500 మంది అధికారులకు జిల్లాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 

read more  హీరో సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం...బెజవాడలో డ్యాన్సులు (photo gallery)

అదే విధంగా 2020వ సంవత్సరం ఏప్రిల్ నెలలో సుమారు 1,23,573 మందికి ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 2019-2020వ సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం నిర్వహణకు రూ.14.98 కోట్లు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జనగణనలో పాల్గొనే సంబంధిత అధికారులను బదిలీ చేయవద్దని పేర్కొన్నారు. పంచాయతీలు, గ్రామాలు, మండలాలు వంటి విలీన ప్రక్రియలు ఏదైనా ఉంటే డిసెంబర్ 31,2019 లోపు పూర్తిచేయాలని కోరారు. 

సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులతో జనగణన విధివిధానాలపై సీఎస్ చర్చించారు. 

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ కె.ఇలంభారతి, జాయింట్ డైరెక్టర్ టి.ఎల్.ఎన్ సిషుకుమార్,  పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ వి.ప్రతిమ, రెవెన్యూ మరియు సీసీఎల్ఏ, పాఠశాల విద్యాశాఖ, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు