అమరావతి: చదువులు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని... అలాగని ప్రభుత్వానికి కూడా భారం కాకూడదని అన్నారు ముఖ్యమంత్రి వైస్ జగన్. అందువల్ల ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉన్నత విద్యపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ కాలేజీ ఫీజులపై ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందించారు.  

ఈ సందర్బంగా ఫీజుల నియంత్రణపై అధికారులతో సీఎం చర్చించారు. ఇందుకోసం ఇప్పుడు రూపొందించుకునే విధానాలు దీర్ఘకాలం అమలు కావాలని సూచించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ను ఎప్పటికప్పుడు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది బకాయిలతో పాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించిన బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

మార్చి 30 కల్లా చెల్లింపులు చేయాలని ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ప్రతి విద్యాసంవత్సరంలో త్రైమాసికం పూర్తికాగానే ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు చెల్లింపుల వల్ల కాలేజీలకూ మంచి జరుగుతుందని... అందుకే సస్టెయిన్‌బుల్‌ ఫీజు విధానం ఉండాలన్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. 

ఈ సమీక్షా సమావేశంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.