రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గోదావరిలో ప్రైవేట్‌ బోట్లను ఎలా అనుమతించారంటూ నిలదీశారు.  

గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్‌ పాలనపై పట్టు కోల్పోయారని విమర్శించారు. గోదావరి నదిలో బోట్లు నడిపే వ్యవహారంపై అన్ని శాఖల అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  

బోట్ టూరిజంపై ఎయిర్‌పోర్ట్‌ తరహాలో విధానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు రాష్ట్రంలో బోట్లన్నింటినీ నిలిపివేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పాపికొండలు విహారయాత్రకు వెళ్లేందుకు బోట్లు నడిపే అంశంలో ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని ఆరోపించారు. 

టూరిజం శాఖ, ఇరిగేషన్ శాఖ, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అధికారుల సమన్వయ లోపం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఇకనైనా ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని సీఎం జగన్ కు సూచించారు.  

ఇకపోతే ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విచారకరమన్నారు సోము వీర్రాజు. కోడెల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు.