అనంతపురం: ఓ వ్యక్తి భార్యను హత్య చేసి కుమారుడిని తీసుకుని పారిపోయిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన శేఖర్ భార్య వెంకటలక్ష్మిని చంపేశాడు. పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టినా భార్య కాపురానికి రాకపోవడంతో అతను దారుణానికి ఒడిగట్టాడు.

ఆ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మడుగుపల్లికి చెందిన నడిపి బయన్న, లక్ష్మీదేవి దంపతుల మూడో కూుతుర వెంకటలక్ష్మమ్మ. ఆమెను 8 ఏళ్ల క్రితం నార్పల మండలం దుగుమర్రికి చెందిన శేఖర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. 

కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. తర్వాత కలహాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల క్రితం భర్తతో గొడవ పడి కుమారుడు దేవా (6)తో కలిసి వెంకటలక్ష్మమ్మ పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి కాపురానికి రావాలంటూ శేఖర్ పంచాయతీలు పెడుతూనే ఉన్నాడు. అయినా వినకపోవడంతో తరుచుగా వచ్చి గొడవ పడుతూ ఉండేవాడు. 

ఆ క్రమంలో శేఖర్ సోమవారంనాడు మడుగుపల్లికి వచ్చిన శేఖర్ భార్యతో గొడవ పడ్డాడు. ఆమెతో గొడవ పడుతూ ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసి గొళ్లెం పెట్టాడు. వంటింటిలో ఉన్న రుబ్బు రోకలి బండతో భార్య తలపై మోదాడు. ఆ తర్వాత కొడవలితో నరికేందుకు ప్రయత్నించాడు. 

అప్పటికే ఆమె మరణించడంతో కుమారుడిని తీసుకుని శేఖర్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డిఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సిఐ దేవేంద్ర కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు.