విశాఖ పర్యటనలో భాగంగా అధికారపార్టీ, ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు తీరుపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విరుచుకు పడ్డారు. విశాఖలోని పార్టీ  కార్యాలయంలో జరిగిన మీడియా సమావేధశంలో ఆయన చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు.

విశాఖలో రెండు రోజులున్న చంద్రబాబు తన పార్టీ ఓటమిని సమీక్షించుకోవటం మరచి జగన్ సర్కారును విమర్శించటానికే సరిపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. గత అయిదేళ్ల చంద్రబాబు పాలనే పిచ్చివాడి చేతిలో రాయిలా సాగిందన్నారు. కానీ ఆయన జగన్ పాలనను విమర్శించడం హాస్యాస్పదమనీ అన్నారు. 

2014 లో అధికారంలోకి రాగానే ఓటుకు నోటుతో మొదలుపెట్టి జగన్ మీద హత్యా ప్రయత్నం వరకూ అంతా పిచ్చోడి చేతి రాయిలా సాగిందన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంతో పాటు కంటి చూపు, మతీ కూడా పోయినట్లుందని ఎద్దేవా చేశారు. 

 తాను అసెంబ్లీలో మాటాడితే  వైఎస్ భయపడే వాడనటాన్ని తెలుగుదేశం కార్యకర్తలు సైతం జోక్ గా తీసిపారేశారన్నారు.  మామగారిని వెన్నుపోటుతో దింపేశాక ఒక్క ఎన్నిక స్వంతంగా గెలిచారా?  అంటు చంద్రబాబును ప్రశ్నించారు.  

2014 బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి, అంతా నా బలమే అనుకున్నారు. కానీ 2019 లో ఒంటరిగా పోటీ చేస్తే ఏమైందో చెప్పాలన్నారు.  జగన్ అఖండ మెజారిటీతో గెలిచి, ఎన్నికల హామీలు అమలు చేస్తుంటే తన కుమారుడు లోకెష్ భవిష్యత్తు ఏమిటా అన్న బెంగతో ఇలా మాటాడుతున్నారని వ్యాఖ్యానించారు.

విశాఖ గురించి తాను కన్న కలలు ఏమైపోతాయో అని చంద్రబాబు బాధ వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేవలం ఇక్కడి విలువైన సంపద దోచుకోవటమే తప్ప ఆయన ఏం చేశారో చెప్పాలని అమర్ ప్రశ్నించారు.