తాగి మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు ఆదోని కోర్టు భారీ జరిమానాలు విధించింది. ఒక్కొక్కరికి ఏకంగా పదివేలకు పైగా జరిమానాలు విధించడమే కాకుండా 14రోజుల జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. 

 కర్నూలు జిల్లా ఆదోని లో మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో పదిమందికి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేశవ్  భారీగా జరిమానా విధించారు. ఆదివారం స్థానికంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మందు బాబులకు సోమవారం కోర్టు ముందు హాజరు పరిచారు.

అయితే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మందుబాబులకు షాకిచ్చారు. కల్లుబావి నాగరాజు 15వేలు, కర్రయ్య 10వేలు, కుంటానహల్ ఈరన్న గౌడ్ 17వేలు, మహమ్మద్ షఫీ 10వేలు, షేక్షావలి 15 వేలు, వెంకటేష్ 17వేలు,రమేష్ కొనకొండల15 వేలు, ఇర్ఫాన్ 15 వేలు, తిప్పన్న సతీష్ 15 వేల రూపాయలు ఫైన్ విధించారు. అంతేకాకుండా వీరంందరికి 14 రోజుల జైలు శిక్షను కూడా విధిస్తూ తీర్పునిచ్చారు. 

ఇలా ఆదోని కోర్టు మందుబాబులు జేబులకు చిల్లులు పెట్టింది. ఈ తీర్పుతో మద్యం ప్రియులు చేసేదేమీలేక తాగిన నేరానికి కోర్టు విధించిన జరిమానా చెల్లించి బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చారు.  వీరందరు 14 రోజులపాటు జైళ్లో గడపాల్సి వుంటుంది.