Asianet News TeluguAsianet News Telugu

నీటి కొరతకు శాశ్వత పరిష్కారం... ఇజ్రాయెల్ ప్రతినిధులతో జగన్ సమావేశం

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇజ్రాయెల్‌ కు చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఐడీఈ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్ నేతృత్వంలోని ప్రతినిధుల ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

A Delegation From IDE Technologies, Israel Meeting With AP CM YS Jagan
Author
Guntur, First Published Feb 26, 2020, 5:30 PM IST

అమరావతి: భవిష్యత్ లో రాష్ట్రంలో చోటుచేసుకునే నీటి కొరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటినుండే ప్రయత్నాలు  మొదలుపెట్టింది. ఇందుకోసం అపారంగా అందుబాటులో వుండే సముద్రపు నీటిని మానవ అవసరాలకు ఉపయోగించే సాంకేతికతను ఉపయోగించాలని భావిస్తోంది. సముద్రపు నీటిని డీశాలినేషన్‌ చేసి వినియోగించడంపై కసరత్తు ప్రారంభించింది. 

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇజ్రాయెల్‌ కు చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఐడీఈ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్ నేతృత్వంలోని ప్రతినిధుల ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో సముద్ర నీటి శుద్ది గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ''మంచినీటిని ఒక్క బొట్టుకూడా వృధా చేయకూడదు. అందుకనే డీశాలినేషన్‌ నీటిపై దృష్టిపెట్టాం. ఇజ్రాయెల్‌ మొత్తం డీ శాలినేషన్‌ నీటినే వినియోగిస్తోంది. పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్‌ నీటినే వినియోగించాలి. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాలకోసం కూడా వినియోగించే పరిస్థితి ఉండాలి. ఆమేరకు ఆ ప్లాంట్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునేట్టు ఉండాలి'' అని సీఎం తెలిపారు.

read more జగన్ నుండి సంకేతాలు... రాజ్యసభకు వెళ్లేది ఆ నలుగురేనా...?

ఎక్కడెక్కడ డీశాలినేషన్‌ ప్లాంట్లు పెట్టాలి అన్నదానిపై అధ్యయనం చేసిఆమేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను సీఎం కోరారు. మొదట విశాఖపట్నంతో ప్రారంభించి దశలవారీగా దీన్ని విస్తరించుకుంటూ వెళ్లాలని సూచించారు. విశాఖపట్నం, తడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ నీటినే వినియోగించేలా చూడాలన్నారు. 

విశాఖపట్నం స్టీల్‌ పాంట్‌కు డీశాలినేషన్‌ లేదా శుద్ధిచేసిన నీటినే వాడేలా చూడాలన్నారు. అలాగే రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్లు కూడా డీ శాలినేషన్‌ నీటిని వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న మురుగునీటి శుద్దికి అవుతున్న ఖర్చు, టెక్నాలజీపైన కూడా దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. 

డీశాలినేషన్‌ ప్లాంట్ల సాంకేతికత, నిర్వహణ, ఖర్చులపై సమగ్ర వివరాలను అందించాలని ఇజ్రాయిల్  ప్రతినిధిబృందాన్ని సీఎం కోరారు. విశాఖపట్నం సహా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆమేరకు నివేదికలు రూపొందించాలన్నారు. పరిశ్రమలకు ఏ ప్రమాణాలతో నీరు కావాలో నిర్ణయించి ఆమేరకు డీశాలినేషన్‌ అవుతున్న ఖర్చు, నిర్వహణ తదితర అంశాలన్నీ నివేదికలో పొందుపరచాలని సూచించారు. 

ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు కూడా సీఎం జగన్ కు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని... నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని అన్నారు. ఏపీలో నీటి కొరతను తీర్చడానికి సీఎం చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమన్నారు. ఇజ్రాయెల్, భారత్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

read more  ఆ కుటుంబాల కోసమే రాజధానిపై వైసిపి సర్కార్...: వడ్డే శోభనాద్రీశ్వరరావు

1964లో తొలిసారిగా కమర్షియల్‌ డీశాలినేషన్‌ ప్లాంటును ఇజ్రాయెల్‌లో పెట్టినట్లు తెలిపారు. ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని... 4 దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కుపైగా ప్లాంట్లను నిర్వహిస్తున్నట్లు సీఎంకు తెలిపారు. భారత్‌తోపాటు, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మా కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయన్నారు. 

భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీశాలినేషన్‌ ప్లాంట్ల వల్ల పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉద్యోగావకాశాలు పెరగడమే కాదు ఆదాయం కూడా వస్తుందన్నారు. సముద్రపునీటిని డీ శాలినేషన్‌ చేయడంతోపాటు కలుషిత నీటిని కూడా శుద్ధిచేయడంలో అత్యుత్తమ సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నట్లు తెలిపారు. 
ఎస్సార్, రిలయన్స్‌ కంపెనీల్లో ఇండస్ట్రియల్‌ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నామని...శుద్ధిచేసిన మురుగునీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని కంపనీ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios