కర్నూలు జిల్లాలోని దేవరగట్టు రక్తసిక్తమయ్యింది. దసరా సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవాలు(కర్రల సమరం) ఉద్రిక్తతకు దారి తీయకుండా  పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భక్తులు వాటిని బేఖాతరు చేశారు. ముఖ్యంగా కర్రలు ఉపయోగించకుండా నిషేధం విధించినప్పటికి అది పనిచేయలేదు. యధావిధిగా కర్రలతో ప్రత్యక్షమైన భక్తులు 
అర్థరాత్రి 12 గంటలకు మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఉత్సవ మూర్తుల ఊరేగింపులో కర్రలతో స్వైర విహారం  చేశారు. అ సరదా కోట్లాటలో తలలు పగిలి దాదాపు 35 మంది భక్తులు  గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. గాయపడిన భక్తులంతా ప్రస్తుతం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


 దసరా ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టు కొండపై జరిగిన బన్ని ఉత్సవం రక్తం చిందించింది. అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా కర్రలు ఉపయోగించకుండా నిషేధం విధించినా భక్తులు వందల సంఖ్యలో  కర్రలతో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల కంటే పెద్ద సంఖ్యలో కర్రలతో దేవరగట్టు కొండకు వచ్చిన భక్తులు తమ ఆనవాయితీ ప్రకారం కర్రలతో నృత్యాలు చేస్తూ..  స్వైర విహారం చేశారు.  అర్ధరాత్రి 12 తర్వాత గ్రామోత్సవానికి బయలుదేరిన ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు వేలాది మంది భక్తులుగుంపులు.. గుంపులుగా కర్రలతో తలపడ్డారు. ఆలయ శివారుకు వెళ్లిన తర్వాత తమ గ్రామానికంటే.. తమ గ్రామానికి ముందు అంటూ తోపులాడుకుని యుద్ధభూమిని గుర్తుకు తెచ్చారు.

బన్ని ఉత్సవంలో సంప్రదాయం పేరిట కర్రలతో తలలు పగిలేలా కొట్టుకోవడాన్ని నిరోధించేందుకు పోలీసులు.. అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ ఈ ఏడాది కూడా విఫలమయ్యాయి. సుమారు రెండు వేల  మంది పోలీసులు.. ద్రోన్ కెమెరాలు.. బాడీ ఓన్ కెమెరాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు... అవసరమైతే లాఠీ చార్జ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించి.. కొండ చుట్టూ అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టి చేసిన తనిఖీలన్నీ వృధానే అయ్యాయి. అర్ధరాత్రికి కొద్దిసేపటి ముందు వందల సంఖ్యలో  భక్తులు దుడ్డుకర్రలతో.. శబ్దాలు చేసుకుంటూ.. దూసుకొచ్చారు. భారీ సంఖ్యలో ఉన్న భక్తులను.. స్వల్ప సంఖ్యలో ఉన్న పోలీసులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు.... పోలీసులు వెనక్కి తగ్గడంతో భక్తుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది..

కేరింతలు కొడుతూ.. కర్రలతో గుంపులు గుంపులగా నృత్యాలు చేశారు. ఎదురొచ్చిన వారిని సరదాగా కర్రలతో కొడుతూ.. గుంపులు గుంపులుగా ప్రదర్శనలు చేశారు. అర్థరాత్రి కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగించేందుకు కొండ కిందకు తెచ్చిన వెంటనే ఆయా గ్రామాల ప్రజలు గుంపులు గుంపులుగా.. తలపడ్డారు. తమ గ్రామానికి ముందు తీసుకెళ్లాలంటే.. ముందు తమ గ్రామానికేనంటూ.. తోపులాలడుకున్నారు. అయితే వేద పండితులు.. నిర్ణయం మేరకు ఆయా గ్రామాల్లో వరుసగా ఊరేగించారు.

నెరణికి.. నెరణికి తండ.. దేవరగట్టు గ్రామాల్లో ఊరేగించి తిరిగి కొండ వద్దకు వచ్చేలోగా తెల్లారిపోయింది. .. తెల్లవార్లు సాగే కర్రల సమరాన్ని తిలకించేందుకు లక్షల మంది తరలిరావడంతో దేవరగట్టు కొండలు, కోనలు జనసంద్రంతో పోటెత్తాయి. అయితే ఈసారి కట్టుదిట్టమైన నిషేధం విధించడంతో.. కర్రల సమరం జరగదని భావించినా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. భక్తులు యధావిధిగా కర్రలతో కదం తొక్కారు. పరిస్థితిని ముందే ఊహించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో... 35 మంది గాయాలపాలయ్యారు. తలపై పడిన కర్రల దెబ్బలకు రక్తం కారుతున్నవారికి చికిత్స అందించారు. అయితే మరో ఇద్దరికి తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో.. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం  అంబులెన్స్ లలో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురికి కాల్చిన టైర్లు మీదపడడంతో శరీరం కాలి గాయపడ్డారు. వారిని కూడా ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు..... ఊహించినట్లే కర్రల సమరం.. రక్తం  చిందినా.. పెద్ద ప్రమాదకర సంఘటనలు జరగకపోవడంతో.. అటు పోలీసులు.. అధికారులు .. ప్రజలు  ఊపిరి పీల్చుకున్నారు.