అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పారదర్శంగా వ్యవహరించి బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకుంది. అలాగే ఎన్నికలను సమర్ధవంతంగా, ఎలాంటి  అవకతరవకలు, అలజడులకు తావు లేకుండా నిర్వహించిన ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బెస్ట్ సీఈఓ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఇలా 2019 ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ కు రెండు అవార్డులు దక్కాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవార్డులను ప్రకటించింది. శనివారం న్యూడిల్లీలో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏపి మాజీ  సీఈవో ద్వివేది పాల్గొని ఈ రెండు అవార్డులను అందుకోనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. 

 ఏపిలో సార్వత్రిక ఎన్నిక‌ల వేడి ర‌గులుతున్న వేళ‌ కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపి ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా ఉన్న రామ్‌ ప్రకాశ్‌ సిసోడియాను బదిలీ చేపి ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని  రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించి కేవలం ఎన్నికల పర్యవేక్షణకే ఆయనను పరిమితమయ్యేలా చూసింది కేంద్ర ఎన్నికల సంఘం. 

దీంతో ఆయన  పూర్తిగా సార్వత్రిక ఎన్నికలపైనే ఫోకస్ పెట్టి  సమర్థవంతంగా నిర్వహించారు. చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్లా ఎన్నికలు ప్రశాంతంగా జరిగడంలో ద్వివేది కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనకు బెస్ట్ అవార్డు  దక్కింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన అనంతరం గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ద్వివేది స్థానంలో ఏపీ జెన్‌కో సీఎండీ, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శిగా వున్న కావేటి విజయానంద్‌ను నియమితులయ్యారు.